మాలవీయనగర్ దాడి కేసు సోమ్‌నాథ్‌పై చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మాలవీయనగర్‌లో అర్థరాత్రి సోదాల కేసుకు సంబంధించి ఆప్ నేత, న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై స్థానిక న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. మాలవీయనగర్‌లోని ఖిర్కీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఆఫ్రికా మహిళలు నివసించే ఓ ఇంట్లోకి అర్ధరాత్రివేళ చొరబడడం, తనిఖీలు నిర్వహించడం, ఆపై అత్యాచారానికి పాల్పడడం తదితర నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణల కింద సోమ్‌నాథ్‌పై చార్జిషీట్‌ను దాఖలు చేశామని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. అత్యాచారం, ఆపై దాడి,ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం తదితరాలతో దర్యాప్తు అధికారి విజయ్ చందేల్ మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతనా సింగ్ ఎదుట చార్జిషీట్‌ను గత నెల 29వ తేదీన దాఖలు చేశారు.
కాగా ఈ ఘటన ఈ ఏడాది జనవరి 16వ తేదీన జరిగింది. సోమ్‌నాథ్ భార తి తమ నివాసాల్లోకి చొరబడి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పలువురు ఆఫ్రికన్ మహిళలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. బహిరంగంగా యూరిన్ శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా సోమ్‌నాథ్ తమను ఆదేశించారని, తమకు కేవిటీ పరీక్ష చేయించారని బాధితురాళ్లు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.ఇదిలాఉండగా వంద పేజీల అభియోగపత్రంలో సాక్షుల వాంగ్మూలాలు, వైద్య పరీక్షల నివేదికలు, సీసీటీవీ నమోదు చేసిన దృశ్యాలతోపాటు మీడియా సిబ్బంది తీసిన వీడియో దృశ్యాలను పోలీసులు పొందుపరిచారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత న్యాయస్థానం సోమ్‌నాథ్‌ను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించే అవకాశముంది. పోలీసులు దాఖలు చేసిన చార్జీషీటులో పేర్కొన్న ఆరోపణలలో మహిళలపై ఆరోపణలు కూడా ఉన్నాయి.
సోమ్‌నాథ్‌తోపాటు మరో 18 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని 6 సెక్షన్ల కింద నేరారోపణలు చేశారు. తొమ్మిదిమంది ఉగాండా మహిళలతో పాటు 40 మంది సాక్షులుగా అందులో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసుపై గత నెల 10వ తేదీన విచారణ జరిగిన సంగతి విదితమే. వచ్చే నెల ఒకటో తేదీలోగా ఈ కేసు తాజా స్థితిగతులకు సంబంధించిన నివేదికను వచ్చే నెల ఒకటో తేదీలోగా తమకు సమర్పించాలని అప్పట్లో కోర్టు ఆదే శించింది. దీంతో పోలీసులు అదే నెల 29వ తేదీన చార్జిషీట్‌ను దాఖలుచేశారు. అయితే ఈ దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ దాఖలుకు అనుమతించాల్సిందిగా ఓ బాధిత ఆఫ్రికన్ మహిళ చేసిన విన్నపాన్ని కోర్టు అప్పట్లో తిరస్కరించింది. అయితే ఈ కేసులో ఉగాండా మహిళకూడా బాధితురాలైనందువల్ల ఆమెను సహ ఫిర్యాదుదారుగా చేర్చుకునేందుకు మాత్రం అనుమతించింది.