మంత్రులు తక్షణమే తప్పుకోవాలి : బీజేపీ
నాగపూర్: పాలకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్‌ఖడ్సేతోపాటు, ఆ పార్టీ సభ్యుడు నానాపటోల్‌లు ఈ అంశాన్ని లేవనెత్తారు. వారంతట వారు తప్పుకోకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరినీ తక్షణమే కచ్చితంగా తప్పించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కేసు నమోదు చేయాలంటూ జల్గావ్ కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
అంతటితో ఆగకుండా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. దీంతో ఉపసభాపతి వసంత్‌ఫుర్కే సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత బీజేపీ సభ్యులు మరోసారి గందరగోళం సృష్టించారు. దీంతో ఉపసభాపతి రోజంతా సభను వాయిదావేశారు. కాగా జల్గావ్ మిల్క్ గ్రోయర్స్ అసోసియేషన్‌ను జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదలాయింపులో రూ. 3.18 కోట్ల మేర కుంభకోణం జరిగిందని బీజేపీ సభ్యులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.