సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని గురువారం రాత్రి మహబూబ్‌నగర్ సభ అనంతరం పార్టీ నేతలు నిర్ణయించారు.
విషయం ముందే తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటికి ఉదయం వెళ్లిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్ చంద్రతో పాటు పలువురు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటి బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివసించే తిరుమల హిల్స్‌కు వెళ్లేందుకు ఆ నియోజకవర్గం ఇన్‌చార్జి వీరేంద్రగౌడ్, ఆయన అనుచరులు బయలుదేరగా మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లేందుకు తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితర మహిళా నాయకులు ప్రయత్నించగా, వారిని కూడా ఇంటికి వెళ్లకముందే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఎమ్మెల్యేలు ఇళ్ల వద్ద లేని సమయంలో ధర్నాలు చేసే కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల పార్టీ నేతలే పెదవి విరిచారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
Published Fri, Apr 24 2015 11:38 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement