ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు..
* ఏమైందక్కడ?
* బీబీఎంపీ వద్ద బాంబు పేలుళ్లు
* ముసుగు ధరించి ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు
* ఉద్యోగులు, జనం అరుపులు.. కేకలు
* క్షణాల్లో పోలీసుల మోహరింపు
* అందరినీ అదుపులోకి తీసుకున్న వైనం
* ఇదంతా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్న జనం
బెంగళూరు : అది బీబీఎంపీ కార్యాలయం... సమయం ఉదయం పది గంటలు. ఉద్యోగులందరూ విధుల్లో నిమగ్నమయ్యారు. అధికారులతో పనులున్న వాళ్లు వస్తున్నారు.. పోతున్నారు. ఆవరణమంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్లుండి బీబీఎంపీ కార్యాలయం గేటు వద్ద బాంబ్ పేలింది. ఆ పేలుడుకు భూమి దద్దరిల్లింది. అధికారులు, ప్రజల గుండెలదిరాయి. ఈ అనుకోని సంఘటనతో ఒక్కసారిగా అక్కడి వారు షాక్‌కు గురయ్యారు.
ఏమి జరిగింది.. ఏమైంది... అంటూ అటు ఇటు పరుగులు పెట్టారు. అంతలోనే పాలికె కౌన్సిల్ సమావేశం జరిగే భవనం ముందు మరో రెండు బాంబులు పేలాయి. నిమిషం క్రితం ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించేలా మారింది. ఏమవుతోందో అర్థం కాక అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అంతలోనే కొందరు ఉగ్రవాదులు ముసుగులు ధరించి చేతిలో ఏకే- 47, స్టన్‌గన్‌లతో కార్యాలయంలోకి చొరబడ్డారు. అంతే అక్కడున్న వారి ప్రాణాలు పైకి పోయాయి. అక్కడున్న ఉద్యోగులు, ప్రజలను ఆ ఉగ్రవాదులు చుట్టుముట్టారు.
వారిని ఒక చోటకు వెళ్లాలని బెదిరించారు. వారి అరుపులకు అక్కడి వారు జడుసుకున్నారు. వారు చెప్పినట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉగ్రవాదుల నిరోధక దళం వారు పాలికె సర్వసభ్య సమావేశ భవనాన్ని చుట్టుముట్టారు. చాకచక్యంగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వారిని క్షేమంగా రక్షించారు. అంతా అయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఇదంతా మాక్‌డ్రిల్‌లో భాగమని.. ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడానికే ఇలా చేశామని అధికారులు చెప్పారు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.