మైనారిటీల సాధికారతపై నఖ్వీ సమీక్ష
ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సంబంధిత అధికారులతో భేటీ
♦ మోడల్ కార్పొరేషన్లుగా మూడు నగరాల అభివృద్ధి
ముంబై: మైనారిటీల సాధికారతకు సంబంధించిన అంశాలపై కేంద్ర మైనారిటీల సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమాన్ని గూర్చిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించానని చెప్పారు. అంతకుముందు మైనారిటీల సంక్షేమంపై రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే, సంబంధిత అధికారులతో కూడా సమావేశమయ్యానని తెలిపారు. మైనారిటీల సాధికారత కోసం రాష్ట్రంలోని మూడు నగర కార్పొరేషన్లను మోడల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఈ సమావేశాల్లో ముందుకొచ్చిందని నఖ్వీ చెప్పారు.
ఈ అంశంపై తాను ఫడ్నవీస్‌తో సవివరంగా చర్చించానని, ఆ మూడు నగరాలను జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుందని తెలిపారు. చాందసవాద శక్తులు, తాలీబానీ మనస్తత్వం అభివృద్ధికి శత్రువులని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఈ శక్తులను ఓడించగలమని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు లౌకికవాదులం అని చెప్పుకుంటూనే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుంటాయని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలందరి సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని నఖ్వీ చెప్పారు.
దేశ పురోగతి దృష్ట్యా ఈ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యమైనవని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంస్కరణల ప్రక్రియకు సంబంధించిన అనేక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. అందుకోసం తాము ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రయత్నాల్లో భాగంగానే ఈ నెల 22న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించి బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేయగలవని నఖ్వీ ఆశాభావం వ్యక్తం చేశారు.