'ప్రధాని వరకు ఎందుకు.. నన్ను ఢీకొట్టు చాలు'
ముంబై: తమ ప్రభుత్వానికి ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని, దీనిపై ఏ సందేహాలు అక్కర్లేదని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలోని బీజేపీ పార్టీ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తమ బంధం నోటీసు పీరియడ్ లో ఉందని ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించిన మరుసటిరోజే ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ప్రధాని మోదీని ఢీకొనే సాహయం చేయవద్దని, అంతగా చేతనైతే ముందుగా తనతో పోటీ పడాలని ఉద్ధవ్ ఠాక్రేకు సంకేతాలిచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 21న జరగనున్న బీఎంసీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదని, ఐదేళ్ల కాలం ఇలాగే అధికారంలో కొనసాగుతామని సీఎం ఫడ్నవీస్.. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. వాటర్ ట్యాక్స్ రేట్లలో మార్పు ఉండదని, స్ట్రీట్ ట్యాక్స్ లు వసూలు చేసే ఉద్దేశం లేదని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
మిత్ర పక్షాలైన బీజేపీ, శివసేన ఈ బీఎంసీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ సెగ రోజురోజుకు పెరిగిపోతోంది. మోదీ వచ్చి ఇక్కడ ర్యాలీలు నిర్వహించి, బీజేపీ తరఫున ప్రచారం చేసినా శివసేనదే విజయమని ఉద్ధవ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఫడ్నవీస్.. రాజకీయంగా తామే స్ట్రాంట్ అని, శివసేన లేకపోయినా ఏం కాదని సంకేతాలు పంపారు.