వచ్చే నెల 15న ‘మహా’ ఒప్పందం
* అంతర్రాష్ట్ర బ్యారేజీల నిర్మాణ ఒప్పందం ముహూర్తం ఖరారు
* ఇది చారిత్రకమవుతుందన్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందాలకు ముహూర్తం ఖరారైంది. ముంబాయిలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్ వేదికగా వచ్చే నెల 15న బ్యారేజీ నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఈ మేరకు సోమవారం అంత ర్రాష్ట్ర బోర్డు కార్యదర్శి అజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. జూలై 15న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంతరాష్ట్ర బోర్డు సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణపు ఎత్తు, ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణ వ్యయ వాటాలు, మహారాష్ట్ర పింపర్డ్ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు, బోర్డు కార్యాలయ ఏర్పాటు అంశాలు ఎజెండాగా చేర్చినట్లు తెలిపారు.
మహారాష్ట్రతో ఒప్పందం చరిత్రాత్మకమవుతుందని హరీశ్‌రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎంతో హరీశ్‌రావు జరిపిన చర్చల సందర్భంగానే తమ్మిడిహెట్టి, మేడిగడ్డ ఎత్తుపై స్పష్టత వచ్చింది. మేడిగడ్డ 101 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో పెద్దగా ముంపులేని దృష్ట్యా, బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే 100 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయాలని ఫడ్నవీస్ సూచించారు.
ముంపు ప్రాంతం, పరిహారం చెల్లింపుల ప్రక్రియ ముగిశాక 101మీటర్ల ఎత్తుకు నీటి నిల్వ పెంచే అంశమూ పరిశీలిస్తామన్నారు. ఇక తమ్మిడిహెట్టి 148 మీటర్ల ఎత్తుకు పూర్తి సమ్మతి తెలిపా రు. పర్యావరణ, అటవీ, కేంద్ర జలసంఘం అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్న దృష్ట్యా దీనిపై అభ్యంతరం లేదన్నారు. ఛనాఖా-కొరటలకు సంబంధించి అటవీ, వైల్డ్‌లైఫ్, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చినందున 213 మీటర్ల ఎత్తులో నిర్మాణం తమకు అంగీకారమేనని ప్రకటించారు. ఇవే వివరాలపై బోర్డు సామవేశంలో మరోమారు చర్చింది తుది నిర్ణయానికి రానున్నారు.