నేటి నుంచి నాగపూర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ సమావేశాలు సోమవారం నుంచి నాగపూర్‌లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వివిధ అంశాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బీజేపీ, దాని మిత్రపక్షమైన శివసేన నాయకులు కూడా వారికి దీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇరిగేషన్‌తోపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పత్తికి కనీస గిట్టుబాటు ధర, స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ), టోల్ ప్రణాళిక తదితన అంశాలపై నాగపూర్‌లో జరిగే సమావేశాల్లో ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ మహారాష్ట్రకు చెందిన నాయకులు నిధులను దారి మళ్లించి కొంత కాలంగా తమకు అన్యాయం చేస్తున్నారని విదర్భ ప్రాంత నాయకులు నిలదీయనున్నారు. అంతటితో ఊరుకోకుండా రోడ్లు, విద్య, ఇతర మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసిన విజయ్ కేల్కర్ కమిటీ గురించి కూడా నిలదీసే ఆస్కారముంది.
దీంతో ఈ సమావేశాల్లో పై రెండు అంశాలపై పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంత ప్రజా ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జోరుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వీటిపై చర్చించేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వం అంగీకరించే అవకాశాలున్నాయి. దీంతో ఇరు ప్రాంతాలకు సాధ్యమైనంత ఎక్కువ నిధులు మంజూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విదర్భ-మరాఠ్వాడాలో వరుసగా మూడేళ్ల నుంచి కరువు తాండవిస్తోంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై సైతం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నడుం బిగిస్తున్నాయి. రైతులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.
అదేవిధంగా విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా గత కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలోని డీఎఫ్ ప్రభుత్వం అమలుచేసిన సబ్సిడీని ఫడ్నవిస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడ్నవిస్ ఫడ్నవిస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విదర్భలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, క్వింటాల్‌కు రూ.7,500 గిట్టుబాటు ధర కల్పించాలని సభలో విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.
ప్లానింగ్ కమిషన్‌కు ప్రత్యామ్నాయం అవసరం: సీఎం
ముంబై: అందరికీ సంక్షేమ ఫలాలు అందేందుకు ప్రస్తుతమున్న ప్లానింగ్ కమిషన్ బదులు నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సూచించారు. ఢిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఫడ్నవిస్ ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు సీఎం కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి. ముంబై అభివృద్ధికి ‘గ్లోబల్ కమర్షియల్ హబ్’ను ఏర్పాటుచేయాలని కోరారని, అలాగే రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ఆదుకునేందుకు తగిన ప్యాకేజీని అందజేయాలని, అలాగే పత్తి, చెరకు పంటలకు తగిన మద్దతు ధర ఇవ్వాలని ప్రధానికి విన్నవించారని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
సజావుగా సాగేనా..
Published Sun, Dec 7 2014 10:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement