లియోపోల్డ్ నెత్తుటి గాయాలకు ఐదేళ్లు
ముంబై: జూలు విదిల్చిన ఉగ్రవాద రాక్షసత్వం కొలాబాలోని లీయోపోల్డ్ కేఫ్‌ను నెత్తుటి చిత్తడి చేసింది. తరచూ విదేశీ యాత్రికులు వచ్చి సేదతీరే ఈ కేఫ్‌లో సముద్రం మార్గాన నగరంలో చొరబడిన పది మంది ఉగ్రవాదుల మూకలో ముగ్గురు కొలాబాలోని లీయోపోల్డ్ కేఫ్‌ను లక్ష్యం చేసుకున్నారు. విచక్షణారహితంగా గుప్పించిన తూటాల జడికి వెచ్చటి నెత్తురు వరద కట్టింది. ప్రాతః సంధ్య కిరణాల వెచ్చదనాన్ని ఆహ్వానిస్తూ కేఫ్‌లో సేద తీరుతున్న పది మంది ప్రాణాలు విడిచారు. ఇదే ఉగ్రవాద ముఠా నగరంలో ఇతర చోట్ల చేసిన దాడుల్లో రక్తం పారి ఏరులయ్యింది. రాక్షసత్వపు హంతక క్రీడలో మొత్తం 166 మంది హతులయ్యారు. మరో 300 గాయపడ్డారు. ఐదేళ్లనాడు తూటాలతో గోడలను జల్లెడ తూట్లుగా మార్చిననాటి పీడ కలను కనపడకుండా పటం కట్టిన పోస్టర్ల వెనుక దాచడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ రోజు ఉదయం కేఫ్‌లో న్యూయార్క్‌కు చెందిన సమంతా ఫిలిప్స్ మాట్లాడుతూ‘‘ఐదేళ్ల కింద ఈ కేఫ్ మీద ఉగ్రవాదులు దాడులు చేసినట్లు విన్నాను. ఆనాటి సంఘటన ప్రపంచాన్నే ఒక కుదుపుకుదింపింది. చల్లని సాయం సంధ్యలో స్నేహితులతో సేదతీరాలని వచ్చిన వారు మృత్యువాత పడడం అనేది ఉహించలేని సంఘటన. అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సమయంలో ఇక్కడ అలాంటి ఓ ఘోరం జరిగిన ఆనవాళ్లు అసలు కనిపించడం లేదు’’ అన్నారు. వ్యాపార పర్యటనకు వచ్చిన ఫిలిప్స్ తను ముంబైకి వచ్చిన ప్రతిసారి లీయో కేఫ్‌కు తప్పకుండా వస్తానన్నారు. ప్రేగ్ నుంచి పర్యటకుడిగా వచ్చిన బెంజిమిన్ కోక్స్ తన ముందున్న ప్లేట్లో సెగలు కక్కే కీమా పావ్ తినడానికి ఉపక్రమిస్తూ ‘‘ఈ నగర స్ఫూర్తిని గురించి విన్నాను. అనేక మార్లు ఉగ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారిందని తెలుసుకున్నాను. అయితే నెత్తుటి గాయాలెన్ని అయినా తడబాటును వదిలి తలెత్తుకు నిలబడడం తన నైజం అని నిరూపించుకుంది. లీయోపోల్డ్ ఈ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచింది. 2008లో ఇక్కడ మారణకాండ సాగిన ఆనవాళ్లు కూడా కనిపించకుండా తన దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది’’ అంటూ ముగించాడు కోక్స్.
ఓ భారతీయ యువ వృతి నిపుణులు బృందం నవ్వుతూ తుళ్లుతూ కేఫ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకూ నవ్వుతూ వచ్చిన ఆ బృందం హఠాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది. ముంబై మీద ఉగ్రవాద దాడి జరిగి నేటికి ఐదేళ్లు గడిచిన విషయం స్ఫురణకు వచ్చినట్లుంది. నెమ్మదిగా ఓ చోట కూర్చున్న వీరిలో శాలిని జైన్ మెల్లగా నోరు విప్పింది. నవంబర్ 26 దాడులు ఈ లీయోపోల్డ్‌కే కాదు మొత్తం ముంబై నగరం మొఖం మీదే ఓ నెత్తుటి గాయంగా నిలిచిపోయింది. నాటి విషాదం విస్మరణీయమే అయినా ప్రజా జీవితం లీయోపోల్డ్‌లోనూ సాధారణంగా మారినందుకు సంతోషం. ప్రజా జీవితాన్ని కకావికలు చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులకు ముఖం మీద గుద్దినట్లు జవాబు చెప్పింది ఈ నగరం’’ నాటి సంఘటనను నేటి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ పలికింది. నాటికీ నేటికి కేవలం ఒకే ఒక మార్పు ప్రఖ్యాత ఇండియాగేట్ నుంచి తాజ్ ప్యాలెస్‌కు సాగే మార్గంలో ఓ పర్మనెంట్ కమెండోలతో కూడిన శాశ్వత పికెట్ ఒకటి ఏర్పాటయింది అని శాలిని ఎత్తి చూపింది. ఎప్పుడూ ప్రయాణికుల కోసం లీయోపోల్డ్ వద్ద ఎదురు చూసే రాంకుశ్వాను పలకరిస్తే ‘‘అదొక భయానక సంఘటన. ఆ రోజు నేను ట్యాక్సీలో కూర్చొని ఉన్నాను. హఠాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. మొదట టపాకాయలు కాలుస్తున్నారనుకున్నా.మరుక్షణం కేఫ్ వైపు చూస్తే ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా కాల్పులు చేస్తుండడం కనిపించింది. అంతటా నెత్తురు చిందింది. నేను నా ట్యాక్సీలోనే నక్కిదాక్కున్నాను. బహుశ అందుకే బతికి బయటపడి ఈ రోజు తిరిగి అదే స్థానంలో నిల్చున్నాను’’ అన్నాడు.