సాక్షి, ముంబై: నగర రహదారులన్నీ వాంఖడే వైపే కదిలాయి. క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్ ఆట చూడటం కోసం వేలాది మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. దీంతో మొదటి రోజే నగర రహదారులపై అక్కడక్కడ విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. ముఖ్యంగా స్టేడియానికి చుట్టపక్కల ఉన్న రోడ్లన్నీ ట్రాఫిక్ శాఖ నో పార్కింగ్‌జోన్‌గా ప్రకటించింది. దీంతో ఎంతో ఉత్సాహంతో క్రికెట్ చూడడానికి కార్లలో వచ్చిన అభిమానులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక మధ్యలోనే ఇరుక్కుపోయారు. బందోబస్తులో భాగంగా అదనపు పోలీసు కమిషనర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, 11వందలకుపైగా మహిళ, పురుష కానిస్టేబుళ్లను నియమించినా వీరంతా స్టేడియంవద్ద విధులు నిర్వహించడానికే సరిపోయారు.
కానీ రహదారులపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను మాత్రం క్రమబద్ధీకరించలేకపోయారు. అయితే వాహనాల్లో వచ్చినవారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంవల్ల వాటిని ఎక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించాలో తెలియక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకున్నారు. మొదటిరోజే ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మిగత నాలుగు రోజులు బెస్ట్ బస్సుల్లో, లోకల్ రైళ్లలో స్టేడియానికి రావాలని నగర ట్రాఫిక్ శాఖ సూచించింది. గతంలో ఈ స్టేడియంలో వివిధ దేశాలతో అనేక వన్ డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. పాకిస్తాన్-ఇండియా మ్యాచ్‌లకు కూడా ఇంత ఇబ్బందులు ఎదురుకాలేదని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నారు. అయితే ఇది టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెంచిందన్నారు.
అభిమానుల రద్దీతో ట్రాఫిక్ జామ్
Published Fri, Nov 15 2013 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement