ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే కోర్టుకెక్కారు.
ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే కోర్టుకెక్కారు. ఎంసీఏ అధ్యక్ష పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై ముండే సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఎస్‌ఎం గోర్వాడ్కర్ తన అభ్యర్థిత్వాన్ని అక్రమంగా తిరస్కరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంసీఏ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటితమైన శరద్‌పవార్‌ను అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టకుండా నిలువరించాలని గోపీనాథ్ తన పిటిషన్‌లో కోరారు. తన పిటిషన్‌లో అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పదవీ కాలం ముగిసిన ఎంసీఏ అధ్యక్షుడు రవిసావంత్, సహాయ కార్యదర్శులు నితిన్ దలాల్, పీవీ శెట్టి, సీటీ సంఘ్వీ, ఎన్నికల అధికారి గోర్వాడ్కర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. గోపీనాథ్ ముండే దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారణ జరపనుంది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోపీనాథ్ ముండే అభ్యర్థిత్వాన్ని నివాస హోదా ఆధారంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఎంసీఏ పాలక మండలిలో ఉండే సభ్యులు ముంబై నివాసులై ఉండాలని అసోసియేషన్ నిబంధనలలో పొందుపర్చి ఉంది. పాలక మండలిలో ఉండే అభ్యర్థికి వివిధ నగరాల్లో పలు నివాసాలు ఉన్నా శాశ్వత నివాసం ముంబై అయి ఉండాలని 2006 ముంబై హైకోర్టు తీర్పులో ప్రకటించింది. ముండే శాశ్వత నివాసం ఆయన ఎన్నికల జాబితాలో నమోదైన స్థలమే అవుతుందని పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు సావంత్ తెలిపారు.