* పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
* అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, ముంబై: పట్టపగలు, నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే హంతకులు ఎలా తప్పించుకుంటున్నారని బొంబాయి హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు విభాగాన్ని కోర్టు ఆదేశించింది. పుణేలో మూఢ నమ్మకాల నిర్మూలన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర ధబోల్కర్, ముంబైలో ఆంగ్ల దిన పత్రిక సీనియర్ రిపోర్టర్ జేడే, పుణేలో నిఖిల్ రాణే, సమాచార హక్కు కార్యకర్త సతీష్ శెట్టి తదితరులు పట్టపగలు, రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు.
హంతకులు వస్తున్నారు, శవాలను చేసి పారిపోతున్నారు. కానీ ఆ హంతకులను మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోతోంది. పుణేలో నడిరోడ్డుమీద నిఖిల్ రాణేపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ నిఖిల్ భార్య అశ్విని రాణే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిటిషన్‌పై న్యాయమూర్తులు వి.ఎం.కానడే, శాలినీ ఫన్సాల్కర్ జోషిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నడిరోడ్డుపై, పట్టపగలు జరిగిన అనేక హత్య కేసులను పోలీసులు ఛేదించలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
హంతకులు విచ్చలవిడిగా తిరగడంవల్ల సామాన్య ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని అశ్వినీ రాణే తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలు విఫలమైనట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. అయితే తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకపోవడంవల్లే హంతకులు, నేరస్తులు తప్పించుకుపోతున్నారని క్రితంసారి జరిగిన విచారణ సందర్భంగా పోలీసు శాఖ స్పష్టం చేసింది. నియమాల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయుధాలకు సంబంధించిన విధానాన్ని సమీక్షించాలి.
కానీ 2010 తరువాత ప్రభుత్వం ఇటువైపు దృష్టిసారించలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ముంబై పోలీసుల వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి తుపాకులు, రివాల్వర్లు ఉన్నాయి. వాటిని భుజానికి వేసుకుని వెళుతుండగా లేదా శుభ్రం చేస్తుండగా పేలుతున్నాయే (మిస్ ఫైర్) తప్ప అవసరమైనప్పుడు పేలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హంతకులను, నేరస్తులను సకాలంలో పట్టుకోలేకపోతున్నారని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
హంతకులు ఎందుకు చిక్కడం లేదు?
Published Sat, Jan 17 2015 5:01 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement