‘చీకట్లు’ తొలగిస్తేనే.. నేరాల అదుపు!
Published Sat, Jan 4 2014 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని వీధుల్లో అలముతున్న చీకట్లే ఆకతాయిలకు, దుండగులకు అవకాశంగా మారుతున్నాయి. వీధుల్లో సరైన వెలుతురు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మహిళలపై దాడులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్యలో గణణీయంగా పెరుగుదల ఉంటోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వార్షిక నివేదికను వెల్లడిస్తూ ప్రముఖంగా పేర్కొన్నారు.ఢిల్లీపోలీసుల కథనం ప్రకారం మహిళలపై దాడులు, రాత్రివేళల్లో నేరాలు అదుపులోకి రావాలంటే ఆయా ప్రాంతాల్లోని వీధుల్లో సరైన వెలుతురు ఉండేలా చేయాలంటున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోని వీధుల్లో సరైన వీధిలైట్ల వ్యవస్థలేదు. పోలీసులు దీనిని ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు.
కేవలం న్యూఢిల్లీ జిల్లా మినహా మరే ప్రాంతంలోనూ రాత్రివేళల్లో వీధిలైట్ల వ్యవస్థ సక్రమంగా లేదు. న్యూఢిల్లీ తరహాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే రక్షణ కల్పించడం సులువవుతుంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించిన పోలీసులు వివిధ ప్రాంతాల్లోని వీధిలైట్లు లేనివి గుర్తించారు. పోలీసుల లెక్కల ప్రకారం 700 ప్రాంతాలు ఈ తరహావి ఉన్నట్టు తేలింది. ఈ అంశాన్ని పలుమార్లు స్థానిక పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా ఆశించిన స్పందన ఉండడం లేదు. పోలీస్ పెట్రోలింగ్ పెంచుతున్నప్పటికీ జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధిలైట్లు లేని కారణంగా మహిళలపై ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. వీటన్నింటిని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడుతు న్నామని వారు వెల్లడించారు.
బస్టాపుల్లో పోలీసు భద్రత
న్యూఢిల్లీ: నగరంలో మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది. ఈ మేరకు వారిపై జరిగే నేరాలను నియంత్రించడంలో భాగంగా బస్టాపుల్లో పోలీసులను నియమించనుంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కాకుండా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని బస్టాపుల్లో పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తామని పోలీసు విభాగ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నేరాలనేవి ఒక్క ప్రాంతానికే పరిమితమైంది కాదని, ఏ సమయంలో ఎక్కడైనా జరగొచ్చన్నారు. అయితే అనేక నేరాలు, తరచుగా మహిళలపై దాడులు జరుగుతున్న కొన్ని ప్రాంతాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. 358 బస్టాపుల్లో భద్రత కోసం పోలీసులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. 75 శాతం మంది ఢిల్లీ వా సులు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారని తెలిపారు. గత పదేళ్లలో బస్టాపుల్లో అనేక గొలుసు దొంగతనం కేసులు పెరిగాయని, యాసి డ్ దాడులు జరిగాయని చెప్పారు. 2012 డిసెం బర్ 16న కదులుతున్న బస్సులో ఓ పారా మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం తర్వాత మహిళల భద్రత అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలు మహిళల రక్షణ కోసం వివిధ చర్యలను చేపట్టాయి.
Advertisement
Advertisement