
రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే అసెంబ్లీ నియోజక వర్గానికి ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే నుంచి శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు, డీఎంకే, దీప పేరవై, బీజేపీ, డీఎండీకే, సీపీఎం, నామ్ తమిళర్ కచ్చి తదితర పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పటివరకు 24 నామినేషన్లు దాఖలైయ్యాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్ మంగళవారం రజనీకాంత్ ను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అమరన్ కు రజనీకాంత్ మద్దతు ఇస్తారన్న ప్రచారం మొదలైంది. దీంతో రజనీకాంత్ స్వయంగా వివరణయిచ్చారు. ఆర్కే నగర్ లో ఉప ఎన్నికలో నామినేషన్ల సమర్పణ గడువు నేటితో ముగియనుంది.