మైసూరు దసరాపై నీలి నీడలు | Mysore Dasara blue shadows | Sakshi
Sakshi News home page

మైసూరు దసరాపై నీలి నీడలు

Published Sun, Aug 3 2014 10:08 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

మైసూరు దసరాపై నీలి నీడలు - Sakshi

మైసూరు దసరాపై నీలి నీడలు

  •    ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి
  •   విలేకరుల సమావేశంలో ప్రమోదా కన్నీరు
  • మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వంతో తమ వంశానికి దశాబ్దాల తరబడి సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంపై దివంగత శ్రీకంఠదత్త న రసింహరాజ ఒడయార్ సతీమణి రాణి ప్రమోదా దేవి శనివారం ఇక్కడ అంబా విలాస్ రాజ ప్రాసాదంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలిసారిగా నోరు విప్పారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రాజ ప్రాసాదంలో నిర్వహించే ప్రైవేట్ దర్బారుపై వినాయక చవితి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

    దసరా ఉత్సవాలను ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అయితే ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా రాజ ప్రాసాదంలో ఓ ధార్మిక కార్యక్రమంగా దసరాను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ దర్బారు కూడా అందులో భాగమేనని చెప్పారు. మైసూరు రాజ ప్రాసాదం తమ ఆధీనంలో లేనందున దసరా ఉత్సవాలను ఎలా నిర్వహించాలని ఆమె ప్రశ్నించారు. శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ సింహాసనంపై కూర్చుని ప్రైవేట్ దర్బారును నిర్వహించే వారని, ఈసారి ఆ పని ఎవరు చేయాలనే సందిగ్ధంలో ఉన్నామని తెలిపారు.

    తనకైతే ప్రైవేట్ దర్బారును నిర్వహించాలనే ఆశ లేదని అన్నారు. కాగా దసరా ఉత్సవాలను తమ ప్రైవేట్ కార్యక్రమంగా ఏనాడూ భావించలేదని చెప్పారు. శ్రీకంఠదత్త లేకుండా దసరాను నిర్వహించాల్సి వస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నారు. మైసూరు రాజ వంశీకుల వారసుని ఇంకా నిర్ణయించలేదని చెబుతూ, సంస్థానం ఆస్తుల విషయం వివాదంలో ఉన్నందున వారసుని ఎంపిక అసాధ్యమని తేల్చి చెప్పారు. మైసూరు ప్యాలెస్ లేనిదే దసరా సంబరాలను ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. మహారాజులు వెండి రథంలో వచ్చి తమ పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకు పూజలు చేసే వారు. ఈసారి ఆయుధ పూజ ఎలా జరపాలని ప్రశ్నించారు.
     
    ప్రభుత్వాలపై నిష్టూరం
     
    1974 వరకు కర్ణాటకను మైసూరు స్టేట్ అని పిలిచే వారని రాణి గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం మైసూరు రాజులకు అనేక హామీలను ఇచ్చిందని తెలిపారు. 40 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలను నెరవేర్చలేదని నిష్టూరమాడారు. దానికి బదులుగా సంస్థానం ఆస్తుల విషయంలో అనేక కేసులు దాఖలు చేసిందని వాపోయారు.
     
    వారసుని ఎంపిక :
     
    వారసుని విషయంలో శృంగేరి మఠం సలహా కోసం ఎదురు చూస్తున్నామని, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వినాయక చవితి లోగా వారసుని ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రమోదా వెల్లడించారు.
     
    మహిళలకు రాజరికం ఆనవాయితీ లేదు
     
    మైసూరు సంస్థానంలో ఇప్పటి వరకు మహిళలు సింహాసనాన్ని అధిష్టించిన దాఖలాలు లేవని రాణి తెలిపారు. కనుక వారసురాలుగా మహిళను ఎంపిక చేసే అవకాశమే లేదని కొట్టి పారేశారు. రాజ ప్రాసాదానికి సంబంధించి అనేక వ్యాజ్యాలు కోర్టుల్లో నడుస్తున్నందున, వారసునికి ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో తలనొప్పిగా పరిణమించరాదని రాణి ఆకాంక్షించారు. అనిశ్చిత వాతావ రణంలో బాధ్యతలు చేపడితే తిప్పలు తప్పవనే ఉద్దేశంతోనే వారసుని ఎంపికలో జాప్యం జరుగుతోందని వివరించారు. తమ కుటుంబంలో వారసుని కోసం పది మంది పేర్లు వినిపిస్తున్నాయని, ఆ పేర్లను బహిరంగ పరచేది లేదని తెలిపారు. ఆరు నూరైనా ప్రైవేట్ దర్బారును నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదని ఆమె తెలిపారు.
     
    రాణితో మాట్లాడతా..సీఎం
     
    మైసూరు రాణి ప్రమోదా దేవి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సాధారణంగా మైసూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మైసూరు దసరా సంబరాలకు రాజ కుటుంబాన్ని ఆహ్వానించడం ఆనవాయితీ అని తెలిపారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందన్నారు. ఆస్తుల విషయమై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని తెలిపారు. మహారాణి అసంతృప్తిని పోగొట్టడానికి తానే వెళ్లి ఆమెతో సమావేశమవుతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement