ఢీ అంటే ఢీ
►నడిగర్ సంఘం ఎన్నికలు నేడే
► బరిలో శరత్‌కుమార్, విశాల్ జట్లు
► రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్న వైనం
► విజయం ఎవరిదో? పరిశ్రమలో ఉత్కంఠ
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) మునుపెప్పుడూ లేనంతగా పత్రికల్లో పెద్దపెద్ద హెడ్డింగ్‌ల్లో వాడివేడి పదజాలాలతో ఒక రకమైన ఉత్కం ఠను కలగజేస్తూ వస్తోంది. ఇందుకు కారణం ఆ సంఘం ఎన్నికలే. సినీ రంగం రెండుగా చీలే రీతిలో తాజా ఎన్నికల సమరం సాగుతోంది. ఎవరిది పైచేయి అన్నది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది. ఈ సమయంలో నడిగర్ సంఘం పూర్వోత్తరాల విషయాలకు ఓ మారు వెళితే... పురట్చి తలైవర్ ఎంజీఆర్, నడిగర్ తిలగం శివాజీగణేశన్ కాలంలో(1952) ఆవిర్భవించిన ఈ సంఘం ఆరు శతాబ్దాలకు పైగా సమష్టిగా సభ్యుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ వస్తోంది. నడిగర్ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహంచడం ఆనవాయితీ.
అలాంటిది ప్రస్తుత కార్య నిర్వాహకవర్గంగా ఉన్న నటుడు శరత్‌కుమార్ బృందం సుమారు పదేళ్లపాటుగా ఏకధాటిగా బాధ్యతల్ని నిర్వహించడం విశేషమనే చెప్పాలి. ఆ జట్టు మళ్లీ సంఘం పదవీ బాధ్యతల్ని ఆశిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా లేక పోతే సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతల్ని చేపడుతూ వచ్చారన్నది గమనార్హం. అలాంటిది శరత్‌కుమార్ ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకింది. నటుడు విశాల్ రూపంలో ఆయనకు పోటీ ఎదురయ్యింది. ఇది మామూలు పోటీ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అన్యాయాలు, అక్రమాలు అంటూ ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
అలాగే, ఒకరి మీద మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా, కోర్టుల్లో పిటిషన్లు సైతం పోటీ పడి మరీ దాఖలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే జాతి, మతం, భాషలను ఎత్తి చూపుతూ దూషించుకునే స్థాయికి చేరింది. పచ్చిగా చెప్పాలంటే తమిళ చిత్ర పరిశ్రమే రెండుగా చీలిపోయే పరిస్థితి దాపురిస్తుందేమో నన్నంత భయపడేలా. నటుడు శరత్‌కుమార్ శుక్రవారం ఆవేశంగా మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఒకటిగా కలిసే అవకాశంమే లేదని వ్యాఖ్యానించారు.
తమిళ నిర్మాతల మండలి శరత్‌కుమార్ జట్టకు మద్దతు ఉందంటూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ మండలి మెడకు చుట్టుకునే పరిస్థితి ఎదురయ్యింది. మండలిలోని చాలా మంది సభ్యులు ఆ మండలి అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతల మండలిలో ముఖ్య పదవిలో ఉన్న జ్ఞానవేల్ రాజా (స్టూడియో గ్రీన్ సంస్థ) మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమావేశంలో 500 వరకు పైగా నిర్మాతలు పాల్గొన్నట్టు సమాచారం.
ఇలాంటి పరిస్థితికి కారణాలేమిటి?
నడిగర్ సంఘం ఎన్నికలు ఇంత గట్టి పోటీని ఎదుర్కోవడానికి, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి కారణాలేమిటన్నదానికి కొంచెం వెనక్కు వెళ్లిచూస్తే స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని సంఘం కార్యాల యాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా బహుళ సముదాయ భవన నిర్మాణ బాధ్యతల్ని ఎస్‌పీఎస్ సంస్థకు అప్పగించారు. ఆ వ్యవహారాలను సంఘ సభ్యుడైన నటుడు పూచి మురుగన్ ప్రశ్నించారు. ఆ విషయంలో ఆయనకు సంతృప్తికరమైన సమాధానం రాలేదంటూ సంఘం భవన నిర్మాణం ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించడంతో పాటు కోర్టు వరకూ వెళ్లారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో భవన నిర్మాణం ఆగిపోయింది.
నటుడు విశాల్ రంగప్రవేశం
ఈ వ్యవహారం నాన్చుకుంటూ పోవడంతో నటుడు విశాల్ రంగంలోకి దిగారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం చిత్ర నిర్మాణం చేపడితే తాము పారితోషికం లేకుండా నటిస్తామని, తద్వారా వచ్చిన ఆదాయంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని బాహాటంగానే ప్రకటించారు. ఆ విధంగా సంఘం వ్యవహారాలను ప్రశ్నించడంతో సంఘ నిర్వాహకులకు విశాల్ దూరం పెరుగుతూ వచ్చింది. అలా మొదలై వ్యక్తిగత దూషణల వరకు వ్యవహారం వెళ్లింది. తనను అవమానించారంటే, తమను విమర్శించారంటూ ఆరోపణల పర్వానికి తెరలేచింది.
ఇది ఇరు జట్టులను ఎన్నికల బరిలోకి దూకే వరకూ దారి తీయించింది. పరిస్థితిని గమనించిన తమిళ నిర్మాతల మండలి, తమిళ సినీ దర్శకుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(పెప్సీ) ప్రతినిధులు సమస్యను సామరస్య చర్చల ద్వారా పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు.
అయితే అప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో విశాల్ జట్టు సామరస్యానికి తావే లేదంటూ తెగేసి చెప్పేసింది. దీంతో నడిగర్‌సంఘం ఎన్నికలు అనివార్యమయ్యాయి. హైకోరు విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆదివారం స్థానిక మైలాపూర్‌లోని ఎబాస్ పాఠశాలలో జరగనున్నాయి.మరికొన్ని గంటల్లో ఎన్నికలపర్వం నిర్వహించనున్న నేప్యథంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు పహారా రంగంలోకిదిగింది. ఆదివారమే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ చిత్రపరిశ్రమను వెంటాడుతోంది.