విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌ | Varalaxmi Sarathkumar lashes out at Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

Published Sat, Jun 15 2019 12:17 AM | Last Updated on Sat, Jun 15 2019 7:08 AM

Varalaxmi Sarathkumar lashes out at Vishal - Sakshi

విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌

పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్‌కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్‌కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్‌ పడింది. కాగా తాజాగా ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నటి వరలక్ష్మిశరత్‌కుమార్‌ నటుడు విశాల్‌పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్‌ పేరుతో విశాల్‌ జట్టు, స్వామి శంకర్‌దాస్‌ పేరుతో కే.భాగ్యరాజ్‌ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్‌దాస్‌ జట్టు గురువారం నటుడు విజయకాంత్‌ను కలిసి మద్దతు కోరారు.

శుక్రవారం నటుడు కమలహాసన్‌ను కలిశారు. కాగా పాండవర్‌ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్‌ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్‌  నడిగర్‌సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్‌కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్‌కుమార్‌ విశాల్‌పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్‌కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది.

ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్‌ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది  ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటుడు విశాల్‌పై మాటల దాడి చేశారు.

వరలక్ష్మికి ఆ హక్కు ఉంది
కాగా వీడియోను విడుదల చేసిన విశాల్‌పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్‌కుమార్‌ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్‌ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్‌ జట్టు నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను స్థానిక ఆల్వార్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్‌సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు.

నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా?
విశాల్‌ వీడియోపై శరత్‌కుమార్‌ సతీమణి, నటి రాధికా శరత్‌కుమార్‌ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్‌ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్‌ మీరు చేసిన ఆరోపణలు  ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్‌కుమార్‌ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్‌కుమార్‌ విశాల్‌పై విరుచుకుపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement