భూకంపం | Nepal Earthquake: Rumours of Tremors in Chennai, Mumbai Spread on Social Media | Sakshi
Sakshi News home page

భూకంపం

Published Sun, Apr 26 2015 2:23 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

Nepal Earthquake: Rumours of Tremors in Chennai, Mumbai Spread on Social Media

చెన్నై, సాక్షి ప్రతినిధి:  శనివారం చెన్నైలో వచ్చిన భూకంపం ప్రజలను బెంబేలెత్తించింది. కొన్ని గంటలపాటు ప్రజలను భీతావహులను చేసింది. నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. నేపాల్‌లో కేంద్రీకృతమై బీభత్సం సృష్టించిన భూకంపం ప్రభావం దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు చెన్నై నగరాన్ని గడగడలాడించింది. వారం రోజులుగా నిప్పులు చెరిగిన ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోగా గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలతో సేదతీరారు. శనివారం ఉదయం సైతం మబ్బువేసుకుని వాతావరణ చల్లగా ఉండడంతో సంతోషించారు.
 
 అయితే ఈ సంతోషాన్ని భూకంపం భగ్నం చేసింది. శనివారం సెలవు కావడంతో అనేక కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే కొన్ని కేంద్రప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు యథావిధిగా పనిచేస్తున్నాయి. సరిగ్గా ఉదయం 11.45 గంటల సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు కుదుపునకు లోనయ్యాయి. ముందుగా కోడంబాక్కం ప్రజలు భూకంపాన్ని ఎదుర్కొన్నారు. ఇళ్లలోని సామాను, ఫర్నిచర్ కదలడం ప్రారంభించగా భూకంపంగా గుర్తించి బైటకు పరుగులు పెట్టారు. వడపళని, మైలాపూర్, అంబత్తూరు గిండీ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం కనిపించింది. ఇవన్నీ ఎక్కువగా నివాస ప్రాంతాలు కావడంతో అపార్టుమెంట్లల్లో నివసించే కుటుంబాలు పిల్లలు సహా బయటకు పరుగులు పెట్టారు.
 
 కొన్ని గంటలపాటూ బయటనే ఉండి ఇళ్లలోకి వెళ్లేందుకు వెనకడుగు వేశారు. మరికొందరు ధైర్యం చేసి ఇళ్లలోకి వెళ్లి టీవీలకు అతుక్కుపోయారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులంతా ఇంటిలో సందడిగా ఉన్న సమయంలో భూమి కంపించడం ఆందోళన రేకెత్తించింది.  ఎత్తై భవనాలు, బహుళ అంతస్తుల్లోని ఆఫీసుల సిబ్బంది, అపార్టమెంట్లల్లో నివసించే కుటుంబాలవారు ఎక్కువగా భయానికి లోనయ్యారు. గిండీ, నందనంలలో మెట్రోరైలు పనులు జరుగుతున్నాయి. వీటి కోసం భారీ గుంతలు తవ్వి క్రేన్లతో పనులు చేస్తున్నారు. మెట్రో పనుల వత్తిడి వల్లనే సామన్లు కదులుతున్నాయని తొలుత భ్రమపడ్డారు.
 
  అయితే ఆ తరువాత భూకంపమని తెలుసుకుని భీతిల్లారు. నందనంలోని ప్రభుత్వ కాలేజీ ఎదురుగా ఉన్న 8 అంతస్థుల భవనంలో అనేక ప్రయివేటు కంపెనీలు పనిచేస్తున్నాయి. 7వ అంతస్తులో ఒక నౌకాయాన కార్యాలయం ఉండగా, ఇక్కడ వందమంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఉదయం 11.45 గంటల సమయంలో ఆఫీసులోని కుర్చీలు, బెంచీలు కదలడం ప్రారంభించడంతో సిబ్బంది భయంతో కేకలు వేశారు. ఈ సంఘటనపై కార్యాలయ మేనేజర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ, తాను కూర్చుని ఉన్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కు జరిగింది, బెంచీ దూరమైంది, మరికొంతసేపటికి తలతిరిగినట్లు అనిపించిందని అన్నారు. భయంతో సిబ్బంది సహా అందరం బయటకు వెళ్లిపోయామని, శనివారం కావడంతో మధ్యాహ్నం 1 గంట వరకే ఆఫీసు వేళలు కాగా, భూకంపం కారణంగా ఆఫీసుకు వెంటనే సెలవు ప్రకటించి సిబ్బందిని పంపివేశానని తెలిపారు.
 
  నందనం ప్రాంతానికి చెందిన రాజేష్, పీటర్ మాట్లాడుతూ, తమ ఇంటిలోని ఫర్నీచర్, వస్తువులు కదిలాయని, తలతిరిగిందని చెప్పారు. టెంపుల్ టవర్ భవనంలోని ఉద్యోగులు రామస్వామి, తిరువెంకడం తీవ్ర భయాందోళనలకు గురైనట్లు చెప్పారు. పుదుచ్చేరి గాంధీ వీధిలోని అపార్టుమెంటు భూకంపం ధాటికి స్వల్పంగా అదిరింది. దుకాణాల్లోని వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement