కొత్త అనుభవం
కచ్చితమైన కొలతలతో చూడ చక్కని ముఖారవిందం తాప్సీ సొంతం. పక్కింటి అమ్మాయిగా, పాశ్చాత్య యువతిగా ఒదిగి పోయే శరీర సౌష్టం కలిగిన తాప్సీ సమున్నత స్థాయికి చేరుకోలేక పోతోంది. అయినా, ఆశించిన స్థాయి కోసం పోరాడుతూనే ఉంది. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ నటిగా ప్రాచుర్యం పొందిన ఈ సుందరి, తమిళంలో ఆడుగలం చిత్రంతో తెరంగ్రేటం చేసింది.
ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించినా, ఆ తర్వాత నటించిన వందాన్...వెండ్రాన్, ఎంగేయుం కాదల్ వంటి చిత్రాలు బాక్సాపీసు వద్ద బోల్తా పడటం తాప్సీకి గడ్డు పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో నటిస్తున్న గంగ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే, తెలుగులో కూడా అవకాశాలు సన్నగిల్లడం గమనార్హం. ప్రస్తుతం హిందీలో అక్షయ కుమార్ పక్కన నటిస్తున్నానని తాప్సీ చెబుతోంది. ఈ చిత్రంలో రాణా, అనుపమ్ ఖేర్‌లాంటి పలువురు ప్రముఖ నటులతో నటించడం మంచి అనుభవమని చెప్పింది.
అదే విధంగా ఈ చిత్రంలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఇకపై సాదా సీదా పాత్రలు పోషించ కూడదని నిర్ణయించినట్టు చెబుతోంది. కష్టాల్లో ఉన్న హీరోయిన్లను హీరో ఆదుకోవడం, ఆ తర్వాత వారిపై ప్రేమ చూపడం వంటి మూస పాత్రలు పోషించి మొహం మొత్తిందని పేర్కొంది. ఇక, సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ, కొత్త అనుభవాలను సొంతం చేసుకున్నట్టు తాప్సీ చెబుతోంది.