ఆటోలకు కొత్త రూల్స్ | New Rules for a local auto | Sakshi
Sakshi News home page

ఆటోలకు కొత్త రూల్స్

Published Tue, Oct 21 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

New Rules for a local auto

  •  టాంపర్ ఫ్రూఫ్ డిజిటల్ మీటర్  
  •  ప్రింటెడ్ రిసిప్ట్... అలారమ్ స్విచ్ కూడా
  •  ప్రయాణికుల సౌకర్యార్థం అంటున్న అధికారులు
  •  ఆర్థిక భారమని వాపోతున్న ఆటోడ్రైవర్లు
  • సాక్షి,బెంగళూరు : ఆటో ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నూతన నిబంధనలను అమలు చేయనుంది. వీటి వల్ల ఇక మీటరు పై అదనంగా చెల్లించడం... మృగాళ్ల లాంటి ఆటో డ్రైవర్ల బారి నుంచి మహిళలను రక్షించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నూతన నిబంధనలు తమపై ఆర్థిక భారాన్ని మోపుతాయని ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు వాపోతున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు లక్ష ఆటోలు ఉన్నాయి.  

    కొంత మంది ఆటోడ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా మీటర్లను ట్యాంపర్ చేసి అదనపు సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మీటరుపై అదనపు సొమ్మును డిమాండ్ చేయడం, మీటరు ప్రకారం ప్రయాణికుడు కోరిన చోటుకు వెళ్లడానికి నిరాకరించడం, ఆటోలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటివి నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఇందుకు సంబంధించిన 10,777  కేసులు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయి.

    సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అనేక కేసులు వీగిపోయాయి. రెండు కేసుల్లో మాత్రమే (మీటర్‌ను ట్యాంపర్ చేసిన విషయమై) కోర్టులో విచారణ జరుగుతోంది. చాలా ఏళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర తూనికలు కొలతల శాఖ.... పోలీసుశాఖతో కలిసి రూపొందించిన కొత్త నిబంధనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అగీకరించినట్లు విశ్వనీయ సమాచారం.
     
    టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటర్...

    నూతన నిబంధనల ప్రకారం మొదట ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీటర్‌ను టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటరుగా ఆధునీకరిస్తారు. లేదా నూతన టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటర్‌ను ఆటోల్లో అమరుస్తారు. అదేవిధంగా ప్రయాణికుడు చెల్లిం చిన సొమ్ముకు ప్రింటెడ్ రిసిప్ట్ నూతన డిజిటల్ మీటరు ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిసిప్ట్‌లో ఆటోనంబర్, డ్రైవర్ పేరుతోపాటు జీపీఎస్ విధానం వల్ల ప్రయాణించిన మార్గం కూడా ప్రింట్ అయ్యి ఉంటుంది. దీని వల్ల ఆటోడ్రైవర్లలో జవాబుతారీ తనం పెరుగుతుంది.

    అంతేకాకుండా అదనపు సొమ్ము వసూలు చేయడం, దగ్గరి గమ్యస్థానానికి కూడా వివిధ చోట్ల తిప్పి ఎక్కువ సొమ్మురాబట్టడం తదితర విషయాలపై నమోదైన కేసుల్లో ప్రింటెడ్ రిసిప్ట్‌ను సాక్ష్యంగా చూపెట్టడం వల్ల ప్రయాణికుడికి మేలుజరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి ప్రింటెండ్ రిసిప్ట్ విధానం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాపకామ్ దుకాణాల్లో ఉండడం గమనార్హం. అదేవిధంగా మహిళలు ఆటోలో ప్రయాణించేటప్పుడు ప్రమాదం ఎదురైన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌తోపాటు చుట్టపక్కల ఉన్నవారికి తెలియజేయడానికి వీలుగా ఎమర్జెన్సీ అలారంను కూడా ఏర్పాటు చేయనున్నారు.

    ప్రస్తుతం ఇలాంటి ఏర్పాటు ఏటీఎంలలో ఉండడం తెలిసిందే. ఈ నూతన నిబంధనలను మొదట బెంగళూరులో అమలు చేసి తర్వాత రాష్ట్రంలోని అన్ని నగరాలకు విస్తరించాలనేది ప్రభుత్వ భావన. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆటోలు ఉన్న స్థితిని పరిగణనలోకి తీసుకుంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరుచుకోవడానికి ఒక్కొక్క ఆటోకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు  ఖర్చవుతుందని అధికారులే చెబుతున్నారు.

    ఇంతటి ఖర్చును మధ్యతరగతికి చెందిన ఆటోడ్రైవర్లు ఎలా భరిస్తారనేది ప్రశ్న. ఈ విషయమై పీస్‌ఆటో వ్యవస్థాపకుడు అనీల్‌శెట్టి మాట్లాడుతూ... ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా దీని వల్ల అయినా ఒక వర్గంపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. అందువల్ల ఆటోల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరించడం కాని  లేదా సబ్సిడీ ప్రకటించడం గాని చేయాలని చేయాలి..’ అని  విజ్ఞప్తి చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement