కొత్తగా ఆహ్వానం.. | new year celebrations in chennei | Sakshi
Sakshi News home page

కొత్తగా ఆహ్వానం..

Published Sun, Jan 1 2017 3:59 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year celebrations in chennei

► నూతన సంవత్సర వేడుకలకు 20 వేల మందితో భద్రత
►అర్ధరాత్రి వరకు  ఆనందోత్సాహం
► నోట్ల కష్టాలతో నిరుత్సాహం


కొత్త సంవత్సర వేడుకలను ఆహ్వానిస్తూ అర్ధరాత్రి వరకు చెన్నై మహానగరంలోని హోటళ్లు, రిసార్ట్స్, వినోద కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇరవై వేల మందితో భద్రతను పర్యవేక్షించారు. ఆలయాల్లో పూజలకు పెద్ద ఎత్తున జన సందోహం తరలి రానుండడంతో ఆయా ప్రాంతాల్లో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.  

సాక్షి, చెన్నై:     ప్రతి ఏటా గడచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సారానికి ఆహ్వానించే విధంగా రాష్ట్రంలో వేడుకలు కోలాహలంగా జరగడం పరిపాటే. వరదలు ముంచెత్తినా, తుపాన్ రూపంలో విలయాలు ముంచుకొచ్చినా...సరే కొత్త వేడుకల్లో మాత్రం జనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ దిశగా ఏడాది ఈ ఏడాది హోటళ్లు, రిసార్ట్స్, గార్డెన్లు, సముద్ర తీరాల్లో కొత్త ఆహ్వానం సందడి సాగింది. శనివారం సాయంత్రం ఆరేడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు కళ్లు చెదిరే లైటింగ్‌్స..ఒళ్లు మెరిసే కలర్స్‌..నరాలకు వైబ్రేషన్స్ తెప్పించే మ్యూజిక్స్‌తో,  విందుల పసందు, మద్యం హోరు...కేక్‌ల కత్తిరింపు , శుభాకాంక్షల జోరుతో కొత్త ఏడాదికి పన్నెండు గంటల సమయంలో ఆహ్వానం పలికారు. చెన్నై నగరంలోని నక్షత్ర హోటళ్లు, శివార్లలోని రిసార్‌్ట్సలలో వేడుకలు సాగాయి.

మెరీనా, బీసెంటర్‌ నగర్‌లలో : మెరీనా తీరం, బీసెంట్‌ నగర్‌ బీచ్‌లలోనూ కొత్త సందడి మిన్నంటింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన నగర వాసులు, ఆనందోత్సాహాలతో సందడి చేశారు. దీంతో కామరాజర్‌ సాలైలో ఆరు గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇక, కొత్త సంవత్సరం వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. ఆదివారం వేకువ జాము నుంచే నగరంలోని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

20 వేల మందితో భద్రత: కొత్త సంవత్సరం భద్రత నిమిత్తం 20 వేల మంది సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నాయి. హోటళ్లలో ఆంక్షల ఉల్లంఘనల్ని పసిగట్టేందుకు ప్రత్యేక బృందాలు చక్కర్లు కొట్టినా, హద్దులు దాటే వారి ఆగడాలకు కల్లెం వేయడం కష్టతరమే. అనేక ప్రధాన కూడళ్లల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మద్యానికి చిత్తై అతిగా వ్యవహరించినా, మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించినా అట్టి వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగారు. ఆదివారం సెలవు దినం కావడంతో మెరీనా, బీసెంట్‌ నగర్‌ బీచ్‌లకు జనం పెద్ద సంఖ్యలో తరలి రావడం ఖాయం. అలాగే, నగరంలోని అన్ని ఆలయాల వద్ద కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాటు సాగాయి. దీంతో జనం ఉదయాన్నే ఆలయాల బాట, సాయంత్రం బీచ్‌లు, వినోద కేంద్రాల బాట పట్టే అవకాశాలు ఉండడంతో అక్కడల్లా భద్రతను కట్టుదిట్టం చేశారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో మఫ్టీ సిబ్బంది రంగంలోకి దించారు. ఇక, మెరీనా, బీసెంట్‌ నగర్‌ బీచ్‌లలో సముద్రంలోకి జనం దూసుకెళ్లని విధంగా ముందస్తు భద్రతగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

శుభాకాంక్షల హోరు : కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలకు శుభాకాంక్షల్ని రాజకీయ పక్షాల నేతలు తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు పేర్కొంటూ, గడిచిన కాలంలో నేర్చుకున్న పాఠాలతో కొత్త ఏడాది భవిష్యత్తు నిర్మాణం దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం పన్నీరుసెల్వం పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగంచేసుకోవాలని, అమ్మ జయలలిత ఆశయ సాధనలో, సమగ్రాభివృద్ధి రాష్ట్రం నిర్మాణం లక్ష్యంగా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో అందరం కలసికట్టుగాముందుకు సాగుదామని పేర్కొంటూ, తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, డీఎండీకే నేత విజయకాంత్, టీఎన్ సీసీ నేత తిరునావుక్కరసర్, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, సీపీఎం నేత జి. రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తురసన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నోట్ల కష్టాలతో నిరుత్సాహం : కొత్త సంవత్సరం అనేక మందిని నిరుత్సాహంలో పడేశాయి. సంబరాల్లో మునిగి తేలేందుకు నోట్ల కష్టాలు తప్పలేదు. శనివారం అనేక ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులు తగిలించడంతో కష్టాలు తప్పలేదు. ఇక, కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు ఉండడంతో అక్కడంతా బారులు తీరి మరి రూ. రెండు వేలు చేజిక్కించుకున్న వాళ్లకే ఆనందమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement