‘నూతన’ సంబరాలపై ఆంక్షలు
Published Tue, Dec 24 2013 2:11 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నామంటే అందరికీ ఆనందమే. ఈ ఆనందం విషాదంగా మారకుండా పోలీసుశాఖ అనేక ఆంక్షలు విధించింది. చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమై ఆంక్షలకు రూపకల్పన చేశారు.పాత ఏడాదిని దాటి తెల్లారితే కొత్త ఏడాదిలో ప్రవేశిస్తున్న సమయంలో బాణాసంచా కాల్చడం, కేక్‌లు కట్‌చేయడం, గుంపులుగా చేరి కేరింతలు కొట్టడం సహజమే. మరో కేటగిరికి చెందిన వ్యక్తులు హోటళ్లలో విందులు, మద్యం తాగి చిందులేయడం కూడా సాధారణమే. చెన్నై నగరంలోనూ, శివార్లలోనూ అనేక హోటళ్లు, రిసార్టులు, అతిథి గృహాలు అత్యధికంగా ఉన్నాయి. వాటిల్లో కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేందుకు గత ఏడాది పోలీసులు అనుమతులు ఇచ్చారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ జార్జ్ చర్చించారు.
ఈనెల 31వ తేదీ రాత్రి నాటి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలను పర్యవేక్షించేందుకు నగరంలో 20 వేల పోలీసులను బందోబస్తుకు నియమించాలని నిర్ణయించారు. గత ఏడాది మెరీనా బీచ్‌కు లక్షమంది ప్రజలు హాజరు కాగా ఈ ఏడాది అదే సంఖ్యలో హాజరవుతారని అంచనావేశారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ రాజేష్‌దాస్ నేతృత్వంలో బీచ్‌రోడ్డులో 2 వేల మంది పోలీసులను మొహరింపజేయనున్నారు. జనవరి 1 వ తేదీన మెరీనాబీచ్ రోడ్డులో వన్‌వే అమలుచేయనున్నారు. స్టార్ హోటళ్లు, బంగ్లాలతో పార్టీలు నిర్వహించేవారు మందుగా అనుమతి తీసుకోవాలి. శుభాకాంక్షలు చెప్పేనెపంతో స్త్రీలపట్ల చొరవచూపితే శిక్ష. కొత్త ఏడాది వేడుకల సంబరాలను అవకాశంగా తీసుకుని తీవ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో ఆ కోణంలో కూడా దృష్టిసారించాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.
ఇవీ నిబంధనలు
స్విమ్మింగ్‌పూల్ సమీపంలో మద్యం తాగడం నిషేధం. కేవలం గదుల్లోనే మద్యం తాగాలి.
పార్టీల సమయంలో భారీ స్పీకర్లు వినియోగించరాదు.
అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం తాగేందుకు తనుమతి. తరువాత గంటపాటూ విందుకు అనుమతి.
సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే అనుమతి. అసభ్య నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు.
వేడుకల సమయంలో ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే యాజమాన్యాలదే బాధ్యత.
హాలు, గదుల్లోకి ముందుగా అనుమతి పొందినవారిని మాత్రమే అనుమతించాలి.
మద్యం తాగి వేగంగా వాహనాలు నడుపరాదు. ఇటువంటి వాహనాలను అదుపు చేసేందుకు నగరంలో ఇనుప స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు.
పార్టీల నిర్వహణపై పోలీసు శాఖ విధించిన నిబంధనలను అంగీకరించినవారికి మాత్రమే అనుమతులు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement