నూతన సంవత్సర వేడుకలకు నగర యువత సిద్ధం
Published Sun, Dec 29 2013 11:21 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు రాజధానివాసులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో స్నేహితులతో కలసి నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందు కు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులను మార్కెట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
కన్నాట్‌ప్లేస్ కళకళ
వరుస వేడుకలతో కన్నాట్‌ప్లేస్ కళకళగా కనిపిస్తోంది. ఆదివారం వారాంతం, కన్నాట్ ప్లేస్‌లో ఫుడ్‌ఫెస్టివల్, వింటేజ్ కార్‌షో, మ్యూజిక్‌మస్తీ కార్యక్రమాలు ఢిల్లీవాసులకు కావాల్సినంత వినోదాన్ని పంచాయి. వీటిల్లో పాల్గొనేందుకు ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కన్నాట్‌ప్లేస్‌లోని ఇన్నర్‌సర్కిల్, ఔటర్ సర్కిల్, సెంట్రల్‌పార్క్ ప్రాంతాల్లో యువత సందడి కనిపించింది. వీరికితోడు విదేశీపర్యాటకులు జత కలిశారు.
ఆసాంతం కేరింతలు
ఎక్కడికక్కడ కార్యక్రమాలతో ఆదివారాన్ని ఎంజాయ్‌చేస్తూ యువత కేరింతలు కొట్టింది. కన్నాట్‌ప్లేస్‌లో పాత కార్ల వద్ద ఫొటోలకు పోజులిస్తూ కనిపించారు. ఎండీఎంసీ వందేళ్ల సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ది గ్రాండ్ సీపీ రీలాంచ్ కార్నివాల్‌లో భాగంగా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. వీనుల విందైన సంగీతాన్ని ఆనందిస్తూ గడిపారు. మరికొందరు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా షాపింగ్ చేశారు.
Advertisement
Advertisement