రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్ చార్జీల బాదుడుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పద్దెనిమిది టోల్‌గేట్లలో పెంచిన టోల్ చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. టోల్‌గేట్ల ముట్టడికి సిద్ధమయ్యారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల్లో దేశం మొత్తంమీద 234 టోల్‌గేట్లు ఉన్నాయి. జాతీయ రహదారుల శాఖ ఒప్పదం మేరకు 1992లో నిర్మించిన రోడ్లకు ఈ ఏడాది ఏప్రిల్, 2008లో నిర్మాణం చేపట్టిన రోడ్లకు సెప్టెంబర్‌లో టోల్‌గేట్ చార్జీలను పెంచేలా నిర్ణయం జరిగింది. ఈ టోల్‌గేట్ వసూళ్ల బాధ్యత ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించింది. తమిళనాడులో మొత్తం 41 టోల్‌గేట్లు ఉండగా, వీటిల్లో 29 టోల్‌గేట్ల వసూలును ప్రయివేటు సంస్థల వారు, 12 టోల్‌గేట్ల బాధ్యతను జాతీయ రహదారుల శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు.
ఈ టోల్‌గేట్లలో రెండేళ్లకు ఒకసారి వసూలు చేయాల్సిన మొత్తం కంటే 10 శాతం నుంచి 15 శాతం వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ దశలో గత ఏడాది సెప్టెంబర్‌లో 21 టోల్‌గేట్ల చార్జీలను పెంచారు. ఈ కారణంగా ఆమ్నిబస్సులు, టాక్సీ, రవాణా వాహనాలు పెరిగిన టోల్‌చార్జీల భారాన్ని ప్రజలపై మోపడం ప్రారంభించాయి. ఈ దశలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 టోల్‌గేట్లలో మళ్లీ టోల్‌చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీల ప్రకారం కారుకు *75 నుండి *85, లారీలు, ఆమ్ని బస్సులు *144 నుండి *165 చెల్లించాల్సి ఉంటుంది. సహజంగానే ఆమ్ని బస్సులు, సరకులను రవాణా చేసే వాహనాలు సైతం ఇదే మోతాదులో తమ చార్జీలను పెంచే అకాశం ఉంది. వీటి ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలకు సైతం రెక్కలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన నెలకొంది.
అధికారి వివరణ:
రాష్ట్రంలోని 18 టోల్‌గేట్లలో 40 శాతం వరకు చార్జీలను పెంచినట్లు అంగీకరించారు. అయితే ఈ చార్జీల పెంపునకు కేంద్రం ఆధీనంలోని జాతీయ రహదారుల శాఖకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లారీ యజమానుల సంఘం ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటికే అధిక చార్జీల భారాన్ని మోస్తున్నామని, నిర్ణీత ధర కంటే ఎక్కువగానే టోల్‌గేట్లలో వసూళ్లు అవుతున్నాయని అన్నారు. టోల్‌గేట్ చార్జీలు పెరిగాయని తమ అద్దెలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి, న్యాయస్థానాలు స్వయంగా కలుగచేసుకుని ప్రభుత్వంపై కేసులు బనాయించిందని అన్నారు.
ముఖ్యంగా చెన్నై-వేలూరు మధ్య రహదారి మృత్యుదారిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకే రహదారులు వాటిల్లో టోల్‌గేట్ల ఏర్పాట్లు సాగాయని, అయితే వాస్తవానికి ఇందుకు విరుద్దమైన పరిస్థితి రహదారుల్లో నెలకొందని అన్నారు. టోల్‌గేట్ల వసూళ్లలో అధికమొత్తాన్ని రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వ అజమాయిషీ లోపం వాహనచోదకుల పాలిట శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇదే ధోరణితో టోల్‌గేట్ చార్జీలను పెంచిన ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు సాగుతున్నాయని చెప్పారు. ప్రజలు ప్రతిఘటించక ముందే ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే లారీ యజమానుల సంఘం తరపున రాష్ట్రంలోని అన్ని టోల్‌గేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
టోల్ బాదుడు
Published Wed, Apr 1 2015 1:55 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement
Advertisement