ఇబ్బందేమీ లేదు! | nithin gadkari speaks about loksabha elections | Sakshi
Sakshi News home page

ఇబ్బందేమీ లేదు!

Published Fri, Mar 7 2014 11:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

nithin gadkari speaks about loksabha elections

 లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ
 
 న్యూఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి ఇబ్బంది లేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకుగాను పోటీపడుతున్నవారి సంఖ్య పదుల్లో ఉందని, అభ్యర్థుల ఎంపిక కమలనాథులకు కష్టం గా మారిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పం దించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపుగాలి వీస్తోం దని, ఢిల్లీలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలిచే అవకాశముందని, దీంతో ఆశావహుల సంఖ్య పెరిగిందన్నారు. మిగతా పార్టీల్లో  ఇటువంటి పరిస్థితి లేనందున పోటీ కూడా లేదన్నారు. అయితే ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నా గెలిచేవారెవరో? పార్టీ కోసం శ్రమించినవారెవరో? అధిష్టానానికి తెలుసని, ప్రజాసేవ చేసే అంకితభావమున్న వ్యక్తులకే టికెట్ కేటాయించే అవకాశముందని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.  
 
 వారంరోజుల్లో కొలిక్కి...
 అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని, తొంభై శాతం పూర్తయిందని, మిగతా మొత్తాన్ని కూడా పూర్తిచేసి వారంరోజుల్లోపే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను ఇస్తానని చెప్పారు. వారంరోజుల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం కూడా ఉందన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేముందు పార్టీలోని దిగువస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
 
 నా ఎంపిక సరైందే...
 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా తాను వ్యవహరించానని, తాను ప్రతి పాదించిన అభ్యర్థుల్లో 90 శాతం మంది ఘన విజ యం సాధించారని గడ్కరీ చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 100 శాతం విజ యం సాధించడం ఖాయమన్నారు. ఏడుగురు అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల ఎంపిక సమయంలో పార్టీ సీనియర్లతో అనేకసార్లు చర్చలు జరిపానని, సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్ కేటాయించే విషయమై చాలా తర్జనభర్జనలు జరిగాయన్నారు. చివరకు అంతాకలిసి తీసుకున్న నిర్ణయం పార్టీకి మెరుగైన ఫలితాలనిచ్చిందన్నారు. కాగా ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యతనిస్తారా? అని ప్రశ్నిం చగా... ఈ విషయమై సీనియర్లతో ఎటువంటి చర్చలు జరపలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు చుక్కెదురు కావడం ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement