
కోలీవుడ్‌లో డబుల్ ధమాకా
దేనికైనా సమయం రావాలంటారు. అందులో ఎంత నిజం ఉందో నిత్యామీనన్‌కు ఇప్పుడు అవగతమై వుంటుంది.
దేనికైనా సమయం రావాలంటారు. అందులో ఎంత నిజం ఉందో నిత్యామీనన్‌కు ఇప్పుడు అవగతమై వుంటుంది. ఈ మలయాళీ భామ సొంతగడ్డపై జయించారు. పొరిగింటి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విజయాలు అందుకున్నారు. అలాంటిది ఇరుగింటి లాంటిదైన తమిళ చిత్ర పరిశ్రమలో ఆశించిన పేరును పొందలేకపోయాననే కించిత్ చింత నిత్యామీనన్‌లా ఇప్పటి వరకు వెంటాడుతోంది. నిత్య ఇంతకుముందే కోలీవుడ్‌లో 180, జెకె ఎను ఒరు నన్భనిన్ కాదల్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే అవేవీ నిత్యా కెరీర్‌కు కోలీవుడ్‌లో హెల్ప్ అవ్వలేదు. జెకె ఎను నన్భనిన్ కాదల్ చిత్రం అయితే తెరపైకే రాలేదు.
డబుల్ ధమాకా : అలాంటిది తాజాగా నిత్యామీనన్ నటించిన రెండు తమిళ చిత్రాలు ఓ కాదల్ కణ్మణి, కాంచన -2 ఒకే రోజు విడుదలవ్వడం అరుదైన విషయం. ఈ రెండు తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ విడుదలై విజయవంతంగా ప్రదర్శించడం మరో విశేషం. ఇదలా ఉంచితే ఈ రెండు చిత్రాల్లో నిత్యామీనన్ నటనకు ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఓ కాదల్ కణ్మణి చిత్రంలో పెళ్లికి ఇష్టపడని ప్రేయసి పాత్రలో నిత్యామీనన్ రొమాంటిక్ నటన అటు ప్రేక్షకులను, ఇటు పరిశ్రమ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గౌతమ్‌మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు నిత్య నటనను అభినందించడం గమనార్హం. అదే విధంగా కాంచన-2లో వికలాంగ యువతిగా నిత్య నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఆమెకు డబుల్ ధమాకా ఆనందాన్ని ఇవ్వడంతో పాటు కోలీవుడ్ దృష్టి ఇప్పుడు నిత్యపై పడింది. తమిళ చిత్ర పరిశ్రమ తలుపులు ఆమె కోసం తెరచుకుంటున్నాయి. ఇక పిలుపు రావడమే ఆలస్యం అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.