
హైవే మందు బంద్
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పక్కనే ఉన్న మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో..
► రాష్ట్రంలో 3,515, బెంగళూరులో 852 బార్లు, షాపుల మూత
► సిటీలో ప్రధాన రోడ్లు, కూడళ్లలోని పానశాలలకు తాళాలు
► మందుబాబుల్లో టెన్షన్
హైవేల పక్కనే ఉన్న మద్యం అంగళ్లు, బార్ల వల్ల డ్రైవర్లు మత్తులో జోగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు ఊపందుకుంది. ఫలితంగా రాష్ట్రంలోను, ఐటీ సిటీలోనూ తీర్పు పరిధిలోకొచ్చే పానశాలలను మూసివేస్తున్నారు. ఎప్పుడూ తెరిచి ఉండే తమ ఆస్థాన మందు అంగడికి తాళాలు పడేసరికి మందుప్రియులు కొత్త షాపులను వెతుక్కుంటూ వెళ్తున్నారు. కొన్నిచోట్ల షాపుల్లో రద్దీల వల్ల గొడవలూ జరుగుతున్నాయి. ఏదేమైనా సుప్రీం తీర్పు అమలు వల్ల విలువైన ప్రాణాలకు భరోసా దక్కుతుంది.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పక్కనే ఉన్న మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ పరిణామం సామాజిక వేత్తలకు సంతోషం తీసువస్తే ప్రభుత్వంతో పాటు మందు బాబులకు కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. రోడ్డు ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలూ కారణమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, జాతీయ రహదార్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను, బార్లను, పబ్‌లను తక్షణం మూసివేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆ మద్యం దుకాణాలకు తెరపడింది. కన్నడనాట 6,572 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 19,578 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల పొడవునా ఉన్న 3,515 మద్యం దుకాణాలు జులై 1 నుంచి మూతపడ్డాయి. శనివారం నుంచి అబ్కారీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ తెరిచి ఉన్న మందు దుకాణాల మూసివేతను ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,500 మద్యం దుకాణాలను మూసివేయగా కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించారు.
బెంగళూరులో హడావుడి
బెంగళూరు నగరంలో 94.89 కిలోమీటర్ల మేర ఆరు జాతీయ రహదారులు వెళుతున్నాయి. దీంతో బెంగళూరులో మొత్తం 852 బార్‌లు, మద్యం దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో నగరంలో మిగతా మద్యం దుకాణాల్లో రద్దీ మరింత పెరిగింది. రహదారులపై మద్యం దుకాణాలు మూతపడడంతో మిగిలిన చోట్లకు మందుబాబులు పరుగులు తీసున్నారు. మిగతా చోట్ల మద్యం అంగళ్లకు క్యూలు కడుతుండగా, రద్దీ పెరిగి ఘర్షణలూ జరుగుతున్నాయి.
అక్రమాలకు ఆరంభం
మూత పడిన మద్యం షాపుల్లో ఇప్పటికీ 14.06 లక్షల బాక్స్‌ల మద్యం నిల్వలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో తేలింది. దీంతో దొడ్డిదారిన ఆ సరుకును అమ్ముకుంటున్నట్లు సమాచారం. మద్యం దుకాణ యజమానులు ఆ మద్యాన్ని మిగతా వైన్‌షాపులకు పంపిస్తున్నారు. కొందరు మద్యం దుకాణం పక్కనే పేరుకు ఒక టీ కొట్టు తెరిచి అందులో మద్యాన్ని అమ్ముతున్న ఫిర్యాదులూ ఎక్సైజ్ శాఖకు అందుతున్నాయి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నారు.