నో స్టాక్‌ | No stack boards in ration shops | Sakshi
Sakshi News home page

నో స్టాక్‌

Published Mon, Mar 6 2017 3:59 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

నో స్టాక్‌

నో స్టాక్‌

► రేషన్  దుకాణాల్లో సరుకులు నిల్‌
► కొన్ని చోట్ల అరకొర సరఫరా
► వినియోగదారుల ముట్టడి
►  ప్రభుత్వానికి స్టాలిన్  హెచ్చరిక


సాక్షి ప్రతినిధి, చెన్నై: చౌక ధర దుకాణాలపైనే ఆధార పడి బతికే బడుగు జీవులు రేషన్  సరుకుల కోసం బావురుమంటున్నారు. దుకాణా ల ముందు నోస్టాక్‌ బోర్డు పెట్టకుండానే సరుకులు లేవని తిప్పి పంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల పంపిణీ తీరు వారంలోగా మెరుగుపడకుంటే రేషన్  దుకాణాల ముందు ఆందోళనలు చేపడతామని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్  ప్రభుత్వాన్ని ఆదివారం హెచ్చరించారు. రాష్ట్రంలోని రేషన్  షాపుల్లో సరుకుల పంపిణీ సంతృప్తికరంగా సాగడంలేదు. రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండాల్సిన అనేక నిత్యావసర సరుకులు వినియోగదారులకు చేరడంలేదు.

ముఖ్యంగా పామాయిల్, పప్పు దినుసు ధాన్యాలు మూడు నాలుగు నెలలుగా అందడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. బియ్యం, చక్కెర సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. పొంగల్‌ పండుగ మాసమైన జనవరిలో కంటితుడుపుగా సరుకులను సరఫరా చేసిన ప్రభుత్వం ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా పట్టించుకోవడం మానివేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా సరుకుల సరఫరా తీరు మెరుగుపడలేదు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా అయ్యే బియ్యమే ఎందరో పేదలకు ఆధారం. అలాగే పామాయిల్‌పై కూడా ప్రజలు ఎదురుచూస్తుంటారు.

రేషన్ దుకాణదారులు ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టి పబ్బంగడుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా చెన్నై శివార్లు మనలిలోని రేషన్ షాపును వినియోగదారులు ఆదివారం ముట్టడించారు. మనలి మండలం 17వ వార్డులోని కొసాప్పూరు రేషన్ దుఖాణం నుంచి 800 మందికి సరుకులు అందాల్సి ఉండగా రెండు నెలలుగా పప్పుదినుసులు, పామాయిల్‌ వస్తువులు ఇవ్వడం లేదు. ఇదేమిటని నిలదీసిన ప్రజలతో నోస్టాక్‌ అని ముక్తసరిగా సమాధానం చెప్పి పంపుతున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఆదివారం దుకాణాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.

స్టాలిన్ సందర్శన:    రేషన్ దుకాణాల వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. తన నియోజకవర్గ పరిధిలోని చింతామణి, అముదం స్టోర్సులలోకి వెళ్లి సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రేషన్ దుకాణాల తీరుపై ప్రజల నుంచి తనకు ఫిర్యాదులు రావడంతో పర్యటనకు వచ్చానని తెలిపారు. రేషన్ దుకాణాల పనితీరును పర్యవేక్షించాలి్సన ప్రజా పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్, సహకార శాఖా మంత్రి సెల్లూరురాజా పొంతనలేని సమాధానాలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు.

పామాయిల్‌ను డిసెంబర్‌లో మాత్రమే పూర్తిస్థాయిలో సరఫరా చేశారని, ఆ తరువాత నుంచి అరకొర స్టాకుతో సరిపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి వెళ్లి రేషన్ దుకాణాల పనితీరును పరిశీలించాలి్సందిగా ఆదేశించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల లోటుపాట్లను సరిదిద్ది పనీతీరును ప్రభుత్వం వారంలోగా మెరుగుపరచకుంటే అన్ని దుకాణాల ముందు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement