
‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’
విజయవాడ: ప్రత్యామ్నాయం చూపకుండా అనాలోచితంగా పాత పెద్ద నోట్లు రద్దు చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని గుర్తు చేశారు.
14 లక్షల కోట్ల రూపాయల 500, వెయ్యి నోట్లు రద్దు చేశారని, కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో మీరు చెప్పిన లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నించారు. కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీవి రావని గ్యారెంటీ ఇవ్వగలరా అని అడిగారు. కొత్తగా చెలామణిలోకి తెచ్చిన 2 వేల రూపాయల నోటు చెల్లని 500, వెయ్యితో సమానమని వ్యాఖ్యానించారు. 2 వేల నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదు, చిల్లర దొరకడం లేదని తెలిపారు. 2 వేల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని ఎద్దేవా చేశారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ రాకముందే 2 వేల నోట్లు ప్రింట్ చేశారా అని ప్రశ్నించారు. నోట్ల కోసం క్యూలో నిలబడిన వారిలో 70 మంది మృతి చెందారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన తల్లిని క్యూలో నిలబెట్టడం అవసరమా అని ప్రశ్నించారు.