సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్యం అమ్మకాలపై ఉన్నఫళంగా అదనంగా 5.5 శాతం వ్యాట్ విధించడం తగదని జిల్లా మద్యం అమ్మకాల సంఘం అధ్యక్షుడు సాహుకార్ సతీష్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని గ్రీన్ చిల్లీ హోటల్‌లో మద్యం అమ్మకాల సంఘం గౌరవాధ్యక్షుడు గురుమూర్తి, సంఘం కార్యదర్శి బసవలింగారెడ్డి, సంఘం ప్రముఖులు రామిరెడ్డి, మారుతి, గోపాలకృష్ణ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై కేవలం 10 శాతం మాత్రమే మార్జిన్ పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారని, ఇందులో అన్ని ఖర్చులు పోను ఎలాంటి లాభాలు రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వ్యాట్ రూపంలో మరో 5.5 శాతం విధిస్తే తాము 4.5 శాతంతో ఎలా వ్యాపారం చేయాలని ప్రశ్నించారు.
ఈ భారం వినియోగదారులపై పడుతుందని, ప్రభుత్వం వెంటనే తమ గోడును వినిపించుకుని వ్యాట్‌ను రద్దు చేయాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మద్యం వ్యాపారులు కోరుతున్నా డిమాండ్లను పరిష్కరించకుండా మరో విధమైన నష్టాలను ఏర్పరిచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం సరి కాదన్నారు. ఈ నెల 20న బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని, ఆయన పట్టించుకోకపోతే తీవ్ర పోరాటం చే స్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం అమ్మకాలపై ప్రభుత్వం చిన్న చూపు చూడటం సరికాదన్నారు. బళ్లారిలో మైనింగ్ వ్యాపారం పూర్తిగా నిలిచిపోవడంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం అమ్మకాలపై అదనపు వ్యాట్ తగదు
Published Wed, Feb 19 2014 6:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement