నోయిడా, గ్రేటర్ నోయిడా పరిసర వాసులు విద్యుత్ కొరత, కోత సమస్యలనుంచి కొంతమేర బయటపడే తరుణం సమీపిస్తోంది. ఇందుకు కారణం వ్యర్థాలనుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీలు అడుగులు వేస్తున్నాయి.దీంతోపాటు ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
నోయిడా: మరో రెండు సంవత్సరాల్లోగా జిల్లాలో తొలి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. దీని అంచనా వ్యయం రూ. 260 కోట్లు. 2016 నాటికల్లా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ఈ మూడు సంస్థలు యోచిస్తున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ ప్రతిరోజూ 1,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. నోయిడా వార్షిక బడ్జెట్ కేవలం రూ. 100 కోట్లే అయినప్పటికీ ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దాదాపు 1,600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో చెత్తను ఎక్కడ పారేయాలనేది పెద్ద తలనొప్పిగా పరిణమించింది.
40 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించినప్పటికీ వ్యర్థాలను పారవేసేందుకు తగినంత స్థలం లేకపోవడం గమనార్హం. ఈ విషయమై ఈ ప్రాజెక్టు ఇన్‌చార్జి సమకంత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘వరుసగా నాలుగోసారి కూడా టెండర్లను పిలిచాం. ఇది పర్యావరణ అనుకూల ప్రాజెక్టు. ఒక సంస్థ తన బిడ్‌ను మాకు దాఖలు చేసింది. సాంకేతిక బిడ్‌ను మా నిపుణుల బృందం పరిశీలించింది. టెండర్ కమిటీ నుంచి అనుమతి లభించగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కన్సల్టెంట్‌ను నియమిస్తాం’ అని అన్నారు. మరో రెండు సంవత్సరాలలోగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
కాగా విద్యుత్ కొరత సమస్యతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం అత్యంత కీలకమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ప్రాజెక్టును నిర్మించాలని, దీనిద్వారా పది మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఐదేళ్లలోగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికైన పెట్టుబడి తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
వ్యర్థాలకు అర్థం..!
Published Sat, Aug 9 2014 10:10 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement