న్యూఢిల్లీ: బోఫోర్స్ ముడుపుల చెల్లింపుల కేసులో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తరువాత అప్పీలు చేయడానికి తనకు అనుమతి లభించలేదని సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ లాయర్ అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది.
2005, మే 31 నాటి తీర్పును సవాలు చేయడానికి సీబీఐకి అనుమతి రాలేదని సంస్థ లాయర్ గురువారం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అప్పీలుకు నిరాకరించిన కేసును తిరిగి కొనసాగిస్తానని అగర్వాల్ చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చాలా అసంబద్ధంగా ఉందని, దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ తీర్పును సవాలు చేయడానికి సీబీఐ ముందుకు రాకపోవడంతో అప్పీలు చేసేందుకు అగర్వాల్‌కు సుప్రీంకోర్టు 2005లోనే అనుమతిచ్చింది.