ఐటీ హబ్‌గా హిందూపురం- ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ
- పీఏబీఆర్ నీటి సరఫరాకు ప్రత్యేక విద్యుత్ లైన్ కోసం రూ.4 కోట్లు విడుదల
- ‘పురం’లో ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు : ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ
హిందూపురం మునిసిపాలిటీ : తగిన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గంలోని పార్టీ ఎమ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పట్టణంలోని కౌన్సిలర్లు, తదితరులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండటం, ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున, బెంగళూరు నుంచి అనంతపురం వరకు ఐటీ కారిడార్ ఏర్పాటు కోసం ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నామని, దానిని కచ్చితంగా తీసుకొస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఇక్కడ ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టామన్నారు.
అలాగే హిందూపురం ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. పట్టణానికి బెంగళూరు ఉండటం, అక్కడ ప్రభుత్వ కిద్వాయ్ ఆస్పత్రి ఉండటం వల్ల నిపుణుల ద్వారా లోతుగా అధ్యయం చేస్తున్నామన్నారు. ఇక నియోజకవర్గానికి పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరా కోసం బంజుల బండ నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్యపై శుక్రవారం అనంతపురంలో జరిగిన సమావేశంలో హంద్రీ నీవా, పీఏబీఆర్ పథకాలపై చర్చించామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి ఉపాధి నిమిత్తం బెంగళూరు గార్మెంట్స్ సంస్థల్లో పని చేసేందుకు వెళ్తున్న మహిళల వలసల నివారణకు ఇక్కడే గార్మెంట్స్ పరిశ్రమల స్థాపనకు తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు.
బాలకృష్ణకు అంగన్‌వాడీ కార్యకర్తల వినతి
అంగన్‌వాడీ కార్యకర్తలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎదుట ఏకరువు పెట్టారు. స్థానిక ఆర్‌అండ్ బీలో వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె చాలడం లేదంటూ యజమానులు, బాడుగకు భవనాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందని, శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అలాగే తమ జీతాలను పెంచాలని వారు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.