సత్రం భూముల వేలంలో బరితెగింపు | npm leaders fired on ap cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

సత్రం భూముల వేలంలో బరితెగింపు

Published Wed, Aug 17 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

సత్రం భూముల వేలంలో బరితెగింపు

సత్రం భూముల వేలంలో బరితెగింపు

టీడీపీ నడిపించిన డ్రామా
ఎన్‌ఏపీఎం నేతల ధ్వజం

సాక్షి ప్రతినిధి, చెన్నై : ఖరీదైన సదావర్తి సత్రం భూములను వేలం పాటతో కారుచౌకగా అమ్మేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం తన బరితెగింపు తనాన్ని చాటుకుందని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్‌ఏపీఎం) జాతీయ కన్వీనర్ భూపతిరాజు రామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన చెన్నైలోని సదావర్తి సత్రం భూములను ‘అరప్పోర్ ఇయక్కం’ తమిళనాడు ప్రతినిధులు జయరామ్ వెంకటేశన్, అత్తూర్ అహ్మద్, వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో రామకృష్ణరాజు మాట్లాడుతూ తమిళనాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.5 కోట్ల నుంచి 6 కోట్లు, అలాగే ప్రభుత్వ ధరనే ఎకరా రూ.2.5 కోట్లు పలుకుతున్న భూములను రూ.27 లక్షలకు అమ్మాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు.

వేలంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా విస్మరించిన టీడీపీ ప్రభుత్వం తమ వారికి భూములను కట్టబెట్టేందుకు డ్రామాను నడిపించిందని విమర్శించారు. వేలం వ్యవహారంలో టీడీపీ నేతలు, అధికారుల కుమ్మక్కు స్పష్టమైందన్నారు. గతంలో నిర్వహించిన వేలం పాట రద్దు చేసి మళ్లీ వేలం పాట నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు ఎన్‌ఏపీఎంతో కలిసి పోరాడనున్నట్లు తమిళనాడుకు చెందిన అరప్పోర్ ఇయక్కం ప్రతినిధి జయరామ్ చెప్పారు. శ్రీదేవి మాట్లాడుతూ విభజనతో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఖరీదైన భూములను నామమాత్ర ధరకు అమ్మడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement