అభిరామి(ఫైల్), కుమార్తెను తలచుకుని రోదిస్తున్న తల్లి
కేకే.నగర్ : పెరంబలూరు ఎంఎం.నగర్‌లో నివసిస్తున్న మంత్రవాది కార్తికేయన్(32) ఆత్మలతో మాట్లాడేందుకు క్షుద్ర పూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతడు మరొక క్షుద్ర మాంత్రికుడు సతీష్ సహాయంతో ఆత్మహత్య చేసుకున్న తేనాంపేట ఎంఎం.గార్డెన్‌కు చెందిన యువతి అభిరామి మృతదేహాన్ని స్మశానం నుంచి వెలికితీసి కారులో పెరంబలూరుకు పంపినట్లు తెలుస్తోంది.
ఈ మృతదేహంపై కూర్చొని కార్తికేయన్ 45 రోజులకు పైగా అర్ధరాత్రి పూజలు జరిపారు. ఈ క్రమంలో అభిరామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పెరంబలూరు పోలీసులు కార్తికేయన్, అతని భార్య నజీమా సహా ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం అభిరామి మృతదేహానికి పెరంబలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పునః పోస్టుమార్టం జరిపారు.
అనంతరం అభిరామి తల్లి కామాక్షి, అన్న తిరువరంగన్‌లు మృతదేహాన్ని తీసుకుని ఆత్తూరు రోడ్డుపై గల స్మశానంలో అంత్యక్రియలు జరిపి అస్థికలను తీసుకుని చెన్నై బయలుదేరారు. తమ కుమార్తెకు కలిగిన దుస్థితిని తలచుకుని అభిరామి తల్లి బోరున విలపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్న కన్నీటితో ప్రార్థించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.