కాలువలో పాత నోట్ల సంచులు
చెన్నై(వేలూరు):
తమిళనాడులోని వానియంబాడి సమీపంలో పాత రూ. 500, 1000 కరెన్సీ నోట్లను చించి వేసి బస్తాలో రోడ్డు పక్కన పడేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేలూరు జిల్లా వానియంబాడిలో ఫర్నీచర్స్, సిమెంట్ రేకులు విక్రయించే దుకాణం ఉంది. సేలం నుంచి సిమెంట్ రేకులను ఓ లారీలో ఇక్కడికి తీసుకొచ్చారు. దెబ్బతినకుండా ఉండేందుకు రేకుల కింద కొన్ని సంచులను ఉంచారు.
రేకులు దించిన అనంతరం ఈ సంచులను ఆ ప్రాంతంలోని రోడ్డు పక్కన కాలువలో పడేశారు. శనివారం ఆ దారిన వెళ్తున్న కొందరు సంచులను పరిశీలించగా అందులో చించివేసిన రూ. 500,1000 నోట్లు కనిపించాయి. అనంతరం ఈ విషయాన్ని వానియంబాడి తాలుకా పోలీసులకు తెలిపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాశీ బస్తాలో ఉన్న కాగితాలను పరిశీలించారు. చించి వేసిన నోట్ల విలువ పెద్దమొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పాత నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటి లెక్కలు చూపించలేక ఇలా చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు.