ఠాణే ముంబ్రాలో బానో కాంప్లెక్స్‌లోని బానోపార్క్ అనే ఓ అయిదంతస్తుల భవనం శనివారం ఉదయం కుప్పకూలింది.
సాక్షి, ముంబై: ఠాణే ముంబ్రాలో బానో కాంప్లెక్స్‌లోని బానోపార్క్ అనే ఓ అయిదంతస్తుల భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో సాయంత్రం అయిదుగంటల వరకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తి మరణించగా, మరొక మహిళను సురక్షితంగా బయటికి తీశారు. మరణించిన వ్యక్తిని అనీస్ ఖాజీ (30)గా గుర్తించ గా ప్రాణాలతో బయటపడ్డ మహిళను షామీనా ఖురేషిగా గుర్తించారు. వారి ద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. ముంబ్రా రైల్వేస్టేషన్ సమీపంలోని జీవన్‌బాగ్ పరిసరాల్లో ఉన్న ఈ భవనంలో సుమారు 42 కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఏడు గంటలపాటు మృత్యువుతో పోరాటం..
భవనం కుప్పకూలిన తర్వాత షామీనా ఖురేషి శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద ఇరుక్కుపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తూ ఏడు గంటలపాటు మృత్యువుతో పోరాడింది. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని కూడా ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
తృటిలో తప్పిన భారీ ప్రమాదం..
భవనం కూలిన సంఘటనలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బిల్డింగ్‌లో ప్రకంపనలతోపాటు శబ్దాలతో మట్టి కూలడం ప్రారంభమైంది. ఇది గమనించిన భవనంలో నివసించేవారందరూ తీవ్ర భయాందోళన లతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. అయితే ముందుగా కొంత మట్టి కూలడంతోపాటు శబ్దాలు రావడంతో అం దరూ బయటికి పరుగులు పెట్టడంతో భారీ ముప్పు తప్పిందని చెప్పవచ్చు. వారందరూ భవనంలోపలే ఉన్నట్టయితే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ సంఘటన అనంతరం పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తొమ్మిదేళ్ల కిందటే నిర్మాణం...
బానోపార్క్‌ను తొమ్మిదేళ్ల కిందటే నిర్మించినట్లు తెలిసింది. స్థానికులు అందించిన వివరాల మేరకు 2005లో అఖిల్ షేఖ్ అనే బిల్డర్ బానో కాంప్లెక్స్‌ను నిర్మించాడు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం ఐదు భవనాలున్నాయి. వీటిలో ఒకటైన బానోపార్క్ శనివారం కూలిపోయింది. 2005లో ఈ భవన నిర్మాణాన్ని కేవలం ఒకటి రెండు నెలల్లోనే పూర్తి చేసినట్టు కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ భవనం నిర్మాణ సమయంలో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) నోటీసులు ఇవ్వడంతోపాటు రెండుసార్లు ఈ భవనంపై చర్యలు తీసుకుంది. ఒకసారి భవనాన్ని టీఎంసీ అధికారులు నేలమట్టం కూడా చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ మళ్లీ ఈ భవనాన్ని పూర్తిచేశారు. నాసిరకం సామగ్రితో నిర్మాణం చేపట్టడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
పోలీసుల అదుపులో బిల్డర్లు
ఈ ఘటన అనంతరం ముంబ్రా పోలీసులు బిల్డర్ అఖిల్ శేఖ్, షకీల్ షేఖ్‌లను దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.