
ఒక్క గొలుసు - ఎనభై మంది 'దొంగలు'
పోయింది ఒక్క బంగారు గొలుసు. కానీ పోలీసులు నాలుగు గంటల్లో ఏకంగా ఎనభై మందిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు పాపం ఇంకా పాలుగారే పసికూనలు! ఇంకా తమాషా ఏమిటంటే అరెస్టయిన వాళ్లంతా ఒక వర్గానికి చెందినవాళ్లే. విడ్డూరంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? కానీ ఇది పచ్చినిజం. ముంబైకి 30 కి.మీ దూరంలో ఉన్న ముంబ్రా పట్టణంలో ఈ సంఘటన జరిగింది.
ఈ మధ్య అక్కడ ఒక చెయిన్ స్నాచింగ్ సంఘటన జరిగింది. ఒక మహిళనుంచి మెడలో చెయిన్ ఎవడో ఒకడు కొట్టేశాడు. అంతే హైపర్ యాక్టివ్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసేశారు. ఇళ్లలోకి వెళ్లి, ఈడ్చుకొచ్చి మరీ అరెస్టులు చేసేశారు. ఒక మహిళ ఇంట్లో తలుపులు వేసుకుని నిద్రపోతుంటే, బోల్ట్ కట్టర్లతో తలుపుల్ని బద్దలుగొట్టి మరీ వచ్చి ఆమె భర్తను అరెస్టు చేశారు. పాపం ఆయన టైఫాయిడ్ తో బాధపడుతున్నాడు. అయినా ఖాకీలు కనికరించలేదు.
'దొంగతనం చేసింది ఒకరో లేక ఇద్దరో. కానీ పోలీసులు ఏకంగా ఏడు వ్యాన్లను తీసుకొచ్చి మా వాళ్లందరినీ కుదేసి తీసుకెళ్లారు,' అని ఓ యువకుడు చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం బలూచిస్తాన్ నుంచి వచ్చిన యువకులు ఎక్కువగా ముంబ్రా ప్రాంతంలో ఉంటారని, వారందరిదీ నేరమయ చరిత్రేనని, దొంగతనాలు, చెయిన్ స్నాచింగ్ లు వారికి అలవాటని దబాయిస్తున్నారు. దొంగలు అక్కడే దాగున్నారు కాబట్టే తాము అరెస్టులు చేశామని వారు వాదిస్తున్నారు. ఇంతా చేసి ఎనభై మందిని అరెస్టు చేసినా, చెయిన్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు ముంబ్రా వాసులు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.