పల్స్ సర్వేపై లెక్క తేల్చండి!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఐదు లక్షల జనాభా లెక్కలు తేలడం లేదు. ఒక్క ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్æ ప్రాంతంలోనే 94 వేల మంది లెక్కతేలాల్సి ఉంది. వీరంతా ఎక్కడ తప్పిపోయారో గుర్తించండి. ఈనెల 15వ తేదీలోపు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి’ అని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ సమన్వయ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందని అసంతృ ప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌పురం, దోర్నాలతో కలుపుకొని మొత్తం 20 మండలాల్లో 60 నుంచి 70శాతం వెనుకబడి ఉన్నాయన్నా రు. కొన్ని ఇళ్లు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని, కొంతమంది సభ్యులనే సర్వే చేసినట్లు తెలుస్తోందన్నారు. సర్వేలో వెనుకబడిన 20 మండలాలకు చెందిన అధికారులు, నియోజకవర్గ సమన్వయ అధికారులకు ఈనెల 4వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు లోతుగా విశ్లేషించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు సూచించారు.
సమన్వయంతో సమస్య పరిష్కరించండి..
2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే సర్వే తక్కువ చేయడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని ఇళ్లు మూతవేయడం వల్ల సర్వే చేయలేకపోయి ఉండవచ్చని, అంతా కలిసి సమన్వయంతో లెక్కల తేడాను పరిష్కరించాలని ఆదేశించారు. 2011 తరువాత జన్మించిన పిల్లల వివరాలు కూడా సర్వే ద్వారా నమోదు చేయాల్సి ఉందన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రా లు, వసతి గృహాల్లోని పిల్లల వివరాలు సర్వేలో నమోదు కావాలని ఆదేశించారు. 2011తరువాత కొత్తగా ఏర్పాటైన మురికివాడలు, కాలనీలకు వెళ్లి సర్వే నమోదు చేయాలన్నారు. ప్రతిరోజూ సర్వేపై సమీక్షించాలని, ఈనెల 6,10,13తేదీల్లో ప్రత్యేకంగా సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతి సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు.
గృహ నిర్మాణం వేగవంతం చేయాలి..
ఎన్‌టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నియోజకవర్గానికి 1250 గృహాలు మంజూరు చేయాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 6,372 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్‌ను పాటిస్తూ మిగిలిన ప్రతిపాదనలను జన్మభూమి కమిటీల ద్వారా గ్రామసభలు నిర్వహించి పంపాలని సూచించారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గం, డివిజన్ల వారీగా సమగ్ర డేటా సేకరించాలన్నారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటివరకు 1207 ఎకరాల్లో గుంతలు తవ్వి 527 ఎకరాల్లో నాటడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతలు తవ్విన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేటపాలెం, బల్లికురవ మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీ మరలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, ఆలోపు మంచి ప్రగతి కనబరచాలన్నారు. జిల్లాలో బోరు బావుల్లో రీ చార్జింVŠ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్–2 ఐ ప్రకాష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.