పోలీస్ ఫక్రుద్దీన్ అరెస్ట్
Published Sun, Oct 6 2013 3:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్ పట్టుబడ్డాడు. అద్వానీపై హత్యాయత్నం, పలు కేసుల్లో ఇతను నిందితుడు. హిందూవాదులే లక్ష్యంగా దాడులు సాగించాడు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి చెన్నైలో పట్టుబడ్డాడు. ఇతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సుమారు 11 గంటలు పోరాడి తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో కొన్నేళ్లుగా తీవ్రవాదుల దాడులు అధికమయ్యూరుు. హిందూవాదులే లక్ష్యంగా దాడులు సాగుతుండడం సంచలనం కలిగించింది. హిందూమున్నని రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్ ఈ ఏడాదిజూలై 1న హత్యకు గురయ్యూరు. అదే నెలాఖరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ తన ఇంటి వద్దే దారుణహత్యకు గురయ్యూరు. అంతకముందు కన్యాకుమారిలో బీజేపీ న్యాయవాది గాంధీపై హత్యాయత్నం జరిగింది. తమిళనాడులోని హిందూ ప్రముఖులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ నేతలు తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
దీంతో ముఖ్యమంత్రి జయలలిత ఆగస్టులో సీబీసీఐడీ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ నరేంద్రపాల్ సింగ్ నాయకత్వంలో ఐజీ మహేష్‌కుమార్ అగర్వాల్, ఎస్పీలు అన్బు, నాగజ్యోతి, జయగౌరీలతో ఏర్పడిన ఈ బృందం వేట ప్రారంభించిం ది. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెంది న పోలీస్ ఫక్రుద్దీన్ (48), తిరునల్వేలి మేల్‌పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35) తదితరులు వెల్లయప్పన్ హత్య జరిగిన ముందురోజు ఆ ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులకు ఆధారా లు దొరికాయి. అలాగే బీజేపీ అగ్రనేత అద్వానీ మదురై రథయాత్ర సమయంలో కల్వర్టు కింద బాంబు పెట్టింది పోలీస్ ఫక్రుద్దీన్, ఇతనిఅనుచరులు ఇస్మాయిల్, బిలాల్‌మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) అని నిర్ధారించుకున్నారు. వీరిని పట్టిస్తే రూ.20 లక్షలు, సమాచారమిచ్చినా ఒక్కో నిందితుని పేరున రూ.5 లక్షలు బహుమతి ఇస్తామని డీజీపీ రామానుజం ప్రకటించారు.
ఇదీ నేర చరిత్ర
మదురైలో ఉంటూ స్థానిక తగాదాల్లో తలదూర్చే స్వభావంతో నేరమయ జీవితాన్ని ప్రారంభించాడు పోలీస్ ఫక్రుద్దీన్. తర్వాత సేలంలో ఒక హత్య కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపాడు. బాంబులు తయారుచేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద శిక్షణ పొందాడు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా పోలీసులపై బాంబులు విసిరి అతన్ని విడిపించుకుపోయాడు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి పోలీస్ ఫక్రుద్దీన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరులో పోలీసులతో ఘర్షణ పడిన సంఘటనలో కాల్పులకు గురై ఇమాం అలీ మృతి చెందాడు. ఈ కసితోనే ఇటీవల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యాలయ సమీపంలో పోలీస్ ఫక్రుద్దీన్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు.
ఎట్టకేలకు అరెస్ట్
చెన్నైలో శుక్రవారం జరిగిన తిరుమల గొడుగుల ఉత్సవంలో కల్లోలం సృష్టించేందుకు కొందరు తీవ్రవాదులు కుట్ర పన్నారని చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌కు సమాచారం అందింది. చెన్నై పెరియమేడులోని ఒక లాడ్జీలో పోలీస్ ఫక్రుద్దీన్ ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అదనపు ఎస్పీ తామరైకన్నన్ నాయకత్వంలో రెండువేల మందికిపైగా పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీస్ ఫక్రుద్దీన్ ఒక ఇన్‌స్పెక్టర్ గొంతునులిమి బాహాబాహికి దిగాడు. మరో ఇన్‌స్పెక్టర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎట్టకేలకు పోలీస్ ఫక్రుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తీవ్రవాదులు బిలాల్, ఇస్మారుుల్‌లను అరెస్ట్ చేశారు. రహస్యంగా చెన్నైకి తరలించారు.
రహస్యంగా జీవనం
పుత్తూరు పట్టణంలోని గేటు పుత్తూరు మేదరవీధిలో బిలాల్, ఇస్మాయిల్ రహస్యంగా జీవనం సాగించారు. ఓ పెంకుల ఇంట్లో బిలాల్, అతని భార్య, ముగ్గురు పిల్లలు ఉండేవారు. పక్కనే ఉన్న ఇంటి మిద్దిపైన గదిలో ఇస్మాయిల్ ఉండేవాడు. ఇరుగుపొరుగు వారితో అంటీముట్టనట్లు ఉండేవారు. శనివారం సోదా జరిపిన బాంబుస్క్వాడ్ ఒక ట్రంకు పెట్టెను స్వాధీనం చేసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున కరెన్సీ ఉన్నట్లు సమాచారం. అలాగే బాంబులు తయారు చేసేందుకు వాడే విడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, ఇతర రద్దీ ప్రాంతాలు, ఆలయాల వద్ద బాంబులు పేల్చాలనే లక్ష్యంతో పేలుడు పదార్థాలు తయారీ సొంతంగా చేస్తున్నట్లు సమాచారం.
Advertisement