విభజనొద్దు
అఖండ కర్ణాటకనే మా లక్ష్యం విధానసభలో సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: అఖండ కర్ణాటక తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసభలో శుక్రవారం స్పష్టం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంత విషయమై శాసనసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఉమేష్‌కత్తియే లక్ష్యంగా మాట్లాడారు. ‘ఉమేష్‌కత్తి నేను మంచి మిత్రులం. అందువల్లే నాకు ఆయనతో చనువు ఎక్కువ. నీవు (ఉమేష్‌కత్తి) పదేపదే ప్రత్యేక రాష్ట్రం అంటూ మాట్లాడటం సరికాదు. మంత్రిగా ఉన్నప్పుడు అలా మాట్లాడి ఉంటే నేను సమర్థించేవాడిని. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం ఎంత వరకూ సమంజసం. అభివృద్ధి కోసం అంటూ రాష్ట్రాన్ని విభజించడం సరికాదు. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు విభజింపబడం వల్ల ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అన్ని ప్రాంతాలను సర్వతోముఖంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది.
అంతేకాకుండా కన్నడ మాట్లాడే 6.31 కోట్ల మంది కన్నడిగులు కలిసి ఉండటమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి సంబంధించి జరిగిన చర్చకు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ సమాధానం ఇచ్చిన సమాధానం పట్ల విపక్ష బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘హై-క’ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ నుంచి వాక్‌అవుట్ చేసింది. అదేవిధంగా వివిధ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ జేడీఎస్ సభలో ధర్నాకు ఉపక్రమించారు. ఈ గందరగోళం మధ్యనే మూజువాణి ఓటుతో ప్రభుత్వం వివిధ రకాల పద్దులను, ముసాయిదా బిల్లులకు ఆమోదముద్ర వేయించుకుంది.