► వెన్నంటి దినకరన్
► ఎమ్మెల్యేల్లో గుబులు
► బెదిరింపుల హోరు
► చెన్నైలోనే మెజారిటీ శాతం మంది తిష్ట
► భద్రత పెంపు
► పళని నెత్తిన అత్తికడవు –అవినాశి పథకం
► అమలుకు యువత ఏకం
సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. సభలో డీఎంకే సృష్టించిన వీరంగాలను వివరించారు. ఆయన వెన్నంటి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఉన్నారు. ఇక, ఓటింగ్‌లో చిన్నమ్మ శశికళ విధేయుడికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. బెదిరింపుల హోరు పెరగడం, ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్న ఆందోళనతో వారి ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.అసెంబ్లీ వేదికగా సాగిన రణరంగం నడుమ బల పరీక్షలో కే పళనిస్వామి నెగ్గారు.
ఆయనకు 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. విశ్వాస పరీక్షలో తాను నెగ్గడంతో మర్యాద పూర్వకంగా ఆదివారం ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తో మంత్రులు జయకుమార్, సెంగోట్టయన్, దిండుగల్ శ్రీనివాసన్, సెవ్వూరు రామచంద్రన్, విజయభాస్కర్, ఎస్‌పీ వేలుమణి, తంగమణి కలిసి అర్ధగంట పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా సభలో బలపరీక్షను అడ్డుకునే విధంగా డీఎంకే వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యేల్లో ఆందోళన
రాష్ట్ర ప్రజానీకం మాజీ సీఎం పన్నీరుకు మద్దతుగా ఓటు వేయాలని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చింది. అయితే, సభలో అందుకు విరుద్ధంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వ్యవహరించారు. ఓటింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభలో రాద్ధాంతం సాగుతున్నా, పళనిస్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఓటు వేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టిన తదుపరి ఎమ్మెల్యేల్ని అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
కొన్నిచోట్ల అయితే, ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలకు బెదిరింపు లు పెరిగాయి. నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆయా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లకుండా పరిస్థితి సద్దుమణిగిన అనంతరం వెళ్లేందుకు నిర్ణయించారు. చెన్నైలోని తమ క్వార్టర్స్‌లో దక్షిణ తమిళనాడుకు చెందిన మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు తిష్ట వేశారు. ఇక, స్పీకర్ ధనపాల్ ఇంటికి భద్రతను మూడంచెలు పెంచారు.
పళని నెత్తిన అత్తికడవు
పశ్చిమ తమిళనాడు నుంచి సీఎంగా అవతరించిన పళనిస్వామికి అక్కడి ప్రజల నుంచి తీవ్ర సంకట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని అనేక పథకాలను తెరమీదకు తెచ్చే పనిలో ప్రజలు పడ్డారు. ప్రజలకు, ప్రజాసంఘాలకు యువజనం మద్దతుగా నిలవడంతో జల్లికట్టు తరహాలో పశ్చిమ తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉద్యమాలు రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈరోడ్, తిరుప్పూర్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు లక్ష్యంగా నిర్ణయించిన అత్తి కడవు– అవినాశి పథకం అమలు లక్ష్యంగా పోరుబాటకు ఆదివారం శ్రీకారం చుట్టడం గమనార్హం. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో, ఆయన మీద ఒత్తిడి తెచ్చి మరీ పథకాలను అమలు చేయడానికి యువత పరగులు తీసే పనిలో పడ్డారు.