రాజా అరెస్ట్?
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ.రాజాను సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. చెన్నైలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయన్ను తమ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నట్టు సమాచారం. మాజీ సీఎం పన్నీరు సెల్వం సోదరుడు రాజాపై పలు ఆరోపణలు బయలు దేరిన విషయం తెలిసిందే. తన అన్న పన్నీరు సీఎంగా ఉన్న సమయంలో రాజా ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వచ్చిన ఫిర్యాదులతో రాజా, పన్నీరు సెల్వం బంధువులు ఇద్దరి పదవులు ఊడినట్టుగా బుధవారం సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో పన్నీరు సోదరుడు రాజాను సీబీసీఐడీ పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్టు గురువారం సంకేతాలు వెలువడ్డాయి. పెరియకుళం కైలాశనాథ ఆలయ పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసుతో పాటుగా, ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారాలు, మరి కొన్ని ఘటనలనకు సంబంధించి రాజా ను విచారించే పనిలో సీబీసీఐడీ ఉన్నట్టు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన మరుక్షణం రాజా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొం టూ వచ్చాయి. చెన్నైలో తిష్టవేసిన రాజా పోయెస్ గార్డెన్‌లో తమ అధినేత్రిని కలుసుకుని తాన నిజాయితీ నిరూపించుకునే వ్యూ హంతో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు.
ఇందుకోసం పోయెస్ గార్డెన్ సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసి ఉన్న రాజను సీబీ సీఐడీ వర్గాలు అదుపులోకి తీసుకున్నట్టు, రహస్య ప్రదేశంలో ఉం చి విచారణ జరుపుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజా అరెస్టు సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు తమిళ మీడియా యత్నించినా ఫలితం శూన్యం.అదే, సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటి వద్దకు మీడియా పరుగులు తీయగా, ఇక్కడెవ్వరూ లేరని సమాచారం ఇవ్వడం గమనించాల్సిందే. రాజాను అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ వర్గాలు విచారణానంతరం అధికారికంగా అరెస్టును చూపించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం బయలు దేరి ఉండడం గమనార్హం.