మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రమే తమిళనాడును రక్షించగలరని ఆయన మద్దతుదారులు చెప్పారు. సెల్వం వర్గీయులు శుక్రవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పన్నీరు సెల్వంతో పాటు పొన్నుస్వామి, సీనియర్ నేతలు, మద్దతుదారులు పాల్గొన్నారు.
జయలలిత వారసత్వాన్ని కొనసాగించే సత్తా సెల్వానికే ఉందని, అమ్మ ఉన్నప్పుడే ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరూ డబ్బుల కోసం శశికళ వెంట వెళ్లవద్దని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నుస్వామి కోరారు. పార్టీ ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని విన్నవించారు. ఆమ్మ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పొన్నుస్వామి కోరారు.