
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రోశయ్య ఈరోజు మధ్యాహ్నం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్ సెల్వంతో పాటు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పన్నీర్ సెల్వం భావోద్వేగానికి గురయ్యారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం ఇది రెండోసారి. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.