గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
చెన్నై: శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు ర్యాలీగా గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లారు.
రిసార్ట్ బయటే సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్‌లో శశికళతో పాటు ఆమె వర్గం ఎమ్మెల్యేలు, అన్నా డీఎంకే పార్టీ నేతలు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. రిసార్ట్ బయట పన్నీరు సెల్వం వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా.. లోపల ఉన్న ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లబోమని చెబుతున్నారు. గవర్నర్ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. పన్నీరు సెల్వం వర్గీయులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.