సాక్షి, ముంబై: ఒక్కపూట భోజనం నోచుకోని ప్రజలు ఒకవైపుంటే మరో వైపు కోట్ల రూపాయల ఖరీదైన బెంజ్ కార్లుంటాయి. ఇది ప్రజాస్వామ్య వైచిత్రి. కరువు కోరల్లో చిక్కిన రాష్ట్ర ప్రజలు పూట గంజికీ నోచని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం అప్పుల ఊబిగా మారి వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిత్యం ప్రజా సంక్షేమం గురించి ప్రకటనలు గుప్పించే పాలక పెద్దలు రాష్ర్ట పర్యటనకు వచ్చే ఢిల్లీ పెద్దల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన కారు కొనుగోలు చేస్తున్నారు. ఏకంగా రెండు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బుల్లెట్ ఫ్రూప్ మర్సడీజ్ బెంజ్ కారు అక్టోబర్ మొదటివారంలో ప్రభుత్వ అధీనంలోకి రానుంది. ఇంత ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తే ఢిల్లీ ప్రముఖులకు భద్రత కోసమని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. ఏదైనా ఒక ప్రజా సంక్షేమ పథకం ప్రవేశపెట్టాలంటే సంవత్సరాలు, నెలలు చర్చోపచర్చలు సాగించే అధికారులు, పాలక వర్గ నాయకమన్యులు ఢిల్లీ పెద్దల కోసం ఒక్క కలం పోటుతో రెండు కోట్ల ప్రజాధనాన్ని చెల్లించేశారు. ఈ విలాసవంతమైన కారు కొనుగోలు కోసం ఎవరితో చర్చలు జరిపారు? ఎవరి అనుమతి తీసుకున్నారో పాలకులకే తెలియాలి.
‘‘ఢిల్లీ నుంచి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు రాష్ట్ర పర్యటనకు వస్తుంటారు. వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా సఫారీలో పర్యటిస్తున్నారు. విదేశీ మంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా ఇదే కారులో తిప్పాల్సి వస్తుంది. ఇది బుల్లెట్ ఫ్రూప్ కారే అయినప్పటికీ దీనిపై బాంబు దాడి జరిగినా లేదా భూమిలో క్లైమర్లు అమర్చి పేల్చినా కారులో కూర్చున్న ప్రముఖుల ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉంది. అలాగే కారు నేలకు ఎత్తు ఉండడం వలన మన రాష్ట్రపతి వంటివారు ఎక్కాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి అనేక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మర్సడీజ్ బెంజి కారు కొనుగోలు చేయాలని నిర్ణయించాము’’ అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారని తెలిసింది.
దీంతో అధికారులు వెంటనే ప్రభుత్వ అతిథులు, వీఐపీల కోసం బెంజ్ ఎస్ మోడల్ కారును ఆర్డరు వేశారు. అక్టోబరు మొదటి వారంలో ఈ కారు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్‌లోకి వచ్చి చేరనుంది. బెంజ్ కంపెనీకి చెందిన ఎస్ మోడల్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ కారుపై బాంబు దాడి, లేదా భూమిలో క్లైమోర్లు అమర్చి పేల్చివేసేందుకు ప్రయత్నించినా ఈ కారులో కూర్చున్న వీఐపీల ప్రాణాలకు ఎలాంటి హానీ జరగదు. అంతేకాకుండా ఈ కారు టైర్లపై రివాల్వర్‌తో కాల్పులు జరిపిన టైర్లు పేలిపోవు. ప్రస్తుతం ఇలాంటి కార్లు బడా పారిశ్రామిక వేత్తలు, అత్యంత ధనవంతులు తమ వ్యక్తిగత భద్రత కోసం వాడుతున్నారు. అందుకే దేశ, విదేశీ మంత్రులు, వీఐపీల భద్రతకు ఇలాంటి కార్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని కొందరు అధికారులు వివరిస్తున్నారు.
డ్రైవర్లకు శిక్షణ తతంగమే...
మర్సడీజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ రాయల్ కారు నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరమట. ఈ కారు నడిపే విధానం నేర్చుకోవడానికి ఇద్దరు డ్రైవర్లను బెంజ్ కంపెనీ తరఫున జర్మనీకి పంపించింది. గతంలో అమెరికా రాష్ట్రపతి ముంబై పర్యటనకు వచ్చినప్పుడు వెంట అక్కడి నుంచి కారు తెచ్చుకున్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఎదురౌతోంది. ఇక నుంచి వీఐపీలు తమవెంట కార్లు తెచ్చుకోవల్సిన అవసరం రాదని అధికారులు సంబరంగా చెబుతున్నారు.
కరువు కోరల్లో ప్రజలుంటే ప్రభువులకు ఖరీదైన కార్లెందుకు?
Published Sat, Sep 28 2013 12:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement