మద్యం మత్తులో బస్సును నడుపుతూ ఓ డ్రైవర్ ప్రయాణీకులను బెంబేలెత్తించాడు. రోడ్డుకు అటూ ఇటూ బస్సు నడుపుతుండటంతో గమనించిన ప్రయాణీకులు హాహాకారాలు చేశారు.
చెన్నై: మద్యం మత్తులో బస్సును నడుపుతూ ఓ డ్రైవర్ ప్రయాణీకులను బెంబేలెత్తించాడు. రోడ్డుకు అటూ ఇటూ బస్సు నడుపుతుండటంతో గమనించిన ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో జరిగింది. తిరుపూర్ పాత బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ప్రభుత్వ బస్సును షణ్ముగమూర్తి (43) నడుపుతున్నాడు. ఉదయం కావడంతో బస్సులో పాఠశాల, కళాశాల విద్యార్థులు, సిట్కోకు పనికి వెళ్లే కార్మికులతో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బస్సును డ్రైవర్ అతి వేగంగా, అడ్డదిడ్డంగా నడుపుతుండటంతో భయంతో కేకలు పెట్టారు.
కొందరు ప్రయాణికులు డ్రైవర్‌ను హెచ్చరించటంతో అతడు వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం సమీపంలోని నల్లూర్ పోలీసు స్టేషన్ ముందు నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, షణ్ముగమూర్తి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగి అతడిని తనిఖీ చేయగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో ప్రయాణికులను వేరే బస్సులో పంపి షణ్ముగ మూర్తిపై అధికారులకు సమాచారం పంపారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన సిబ్బంది షణ్ముగమూర్తిని వైద్య పరీక్షల కోసం తిరుపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.