మద్యం మత్తులో బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై కట్టంగూర్ పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది.
నల్గొండ: మద్యం మత్తులో బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై కట్టంగూర్ పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సూర్యాపేటకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు (ఎక్స్‌ప్రెస్) నల్లగొండ నుంచి గురువారం సాయంత్రం సూర్యాపేటకు బయలు దేరింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కే సత్యనారాయణరావు సూర్యాపేట డిపోలో ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గురువారం సాయంత్రం నల్లగొండ నుంచి 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు నల్లగొండలోని అద్దెంకి బైపాస్ వద్ద మరో ఆర్టీసీ బస్సును, దండెంపల్లి శివారులో ఆటోను ఢీకొట్టి కట్టంగూర్ వైపు నడిపాడు. ప్రయాణికులు వారించినా తాగినా మైకంలో వచ్చి కట్టంగూర్ బస్‌స్టాప్ వద్ద ఆగిఉన్న డీసీఎంను వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు.