అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రం మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని, దానిపై నిషేధం విధించాలని కోరుతూ హిందూసేన
సాక్షి, న్యూఢిల్లీ: అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రం మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని, దానిపై నిషేధం విధించాలని కోరుతూ హిందూసేన కార్యకర్తలు పీకే సినిమాను ప్రదర్శిస్తోన్న డిలైట్ సినిమా హాలు ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులు పీకే సినిమా హాలు బయట ఉన్న పోస్టరును చించివేశారు. థియేటర్ కిటీకీని ధ్వంసం చేశారని హాలు సిబ్బంది చెప్పారు. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలపైన, నటీనటులపైనా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసన ప్రదర్శన కారణంగా మధ్యాహ్నం 12.15 గంటల షో ఆలస్యంగా ప్రారంభమైంది. నోయిడా, గాజియాబాద్‌లలో పీకేను నిషేధించాలన్న డిమాండ్ వినిపించింది. నోయిడాలో సినిమా పోస్టరును , గాజియాబాద్‌లో అమీర్‌ఖాన్ ఫొటోను తగులబెట్టారు.
పీకేను నిషేధించాలి : వీహెచ్‌పీ
న్యూఢిల్లీ : నగరంలో బాలివుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన పీకే’ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నదని, తక్షణమే ఆ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు డిమాండ్ చేశారు. దర్యాగంజ్, డిలైట్ , పీవీఆర్ ప్రియా ధియేటర్ల వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడారు. పీకే సినిమా హిందువులను కించపర్చే విధంగా ఉన్నదని, తక్షణమే నిషేధించాలని సెన్సార్ చైర్‌పర్సన్‌కు విజ్ఞప్తి చేశారు. పలుచోట్ల సినిమా ధియేటర్ల వద్ద ఆందోళనలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, ధియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.